Begin typing your search above and press return to search.

అమంచికి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహం ఫ‌లించేనా?

By:  Tupaki Desk   |   6 March 2019 4:53 AM GMT
అమంచికి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహం ఫ‌లించేనా?
X
ప్ర‌యోగాలు చేయ‌టం మంచిదే. కానీ.. ఎలాంటి ప‌రిస్థితుల్లో.. చుట్టూ సానుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ప్పుడు. కానీ.. అందుకు భిన్నంగా సంక్లిష్టంగా ఉన్న ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు మినిమం గ్యారెంటీకి అవ‌కాశం లేని వారిని రంగంలోకి దించ‌టంలో లాభం ఉంటుందా? అంటే డౌటే. ఇప్పుడు బాబు వ్యూహం కూడా అలానే ఉందంటున్నారు. ప్ర‌కాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంపై బాబుకు షాకు మీద షాకులు త‌గిలాయి.

ఇండిపెండెంట్ గా 2014లో గెలిచిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ త‌ర్వాతి కాలంలో టీడీపీలో చేరారు. ప్ర‌భుత్వం నుంచి ప‌నులు చేయించుకున్న ఆయ‌న‌.. తన‌పై అక్ర‌మంగా పెట్టిన కేసుల నుంచి విముక్తి క‌లిగించాల‌ని.. త‌న వారిని కేసుల పేరుతో వేధిస్తున్న వైనాన్ని ఆపాలంటూ కోరిన‌ట్లు చెబుతారు. అయితే.. ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ల‌న్ని హామీల వ‌ర‌కే ఆగిపోవ‌టం.. ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌టంతో విసుగు చెందిన ఆమంచి కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ పార్టీ నుంచి జంప్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆమంచికి ప్ర‌త్యామ్నాయం పెద్ద‌గా లేక‌పోవ‌టం.. టికెట్ కోసం కొట్టుకోవ‌ట‌మే త‌ప్పించి గెలిచే సీన్ లేని త‌మ్ముళ్ల‌తో బాబుకు దిమ్మ తిరిగిపోతోంది. ఈ సీటు లెక్క తేల్చేందుకు బాబు చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు స‌రికదా.. కొత్త స‌మ‌స్య‌లు తెర మీద‌కు వ‌స్తున్న ప‌రిస్థితి. సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాంను ఒక ద‌శ‌లో రంగంలోకి దించాల‌ని భావించినా.. దాని కార‌ణంగా లేనిపోని స‌మ‌స్య‌లు కొని తెచ్చుకోవ‌ట‌మే అన్న విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గుర్తించిన బాబు.. ఆ ఆలోచ‌న‌కు బ్రేక్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కొత్త ప్ర‌యోగాన్ని తెర మీద‌కు తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. బాప‌ట్ల ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీ‌రాం మాల్యాద్రిని అసెంబ్లీ టికెట్ ఇవ్వ‌టం ద్వారా.. చీరాల చిక్కుల‌కు చెక్ చెప్పాల‌న్న యోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు చెబుతున్నారు. బాప‌ట్ల లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే చీరాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉంటుంది. దీనికి తోడు.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల విష‌యంలో సంతృప్తిక‌రంగా ఉన్న‌ట్లుగా అందిన స‌మాచారంతో బాబు త‌న వ్యూహాన్ని మార్చుకొని బ‌ల‌రాంకు బ‌దులుగా మాల్యాద్రిని బ‌రిలోకి దించాల‌న్న భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

చీరాల‌లో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా ఆమంచిపై పోటీ చేయ‌టానికి మాల్యాద్రిని పోటీలోకి దించేందుకు ఆయ‌న‌కు పొలిటిక‌ల్ గాడ్ ఫాద‌ర్ గా చెప్పే సుజ‌నా చౌద‌రితో బాబు మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. మాల్యాద్రిని ఒప్పించే బాధ్య‌త‌ను సుజ‌నా మీద పెట్టిన బాబు.. చీరాల స‌మ‌స్య‌ను ఒక కొలిక్కి తెచ్చిన‌ట్లుగా భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే.. మాల్యాద్రికి చీరాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా బ‌లం లేద‌ని.. ఆయ‌న‌కున్న ప‌ట్టు త‌క్కువేన‌న్న మాట వినిపిస్తోంది. ఎంపీగా ఆయ‌న అడుగులు ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉన్నాయే త‌ప్పించి.. అసెంబ్లీ స్థాయిలో ఆయ‌న ఎప్పుడూ దృష్టి పెట్ట‌లేద‌ని.. పెద్ద‌గా కేడ‌ర్ లేద‌న్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌లో బాబు చేస్తున్న ప్ర‌యోగం ఎంత మేర ఫ‌లిస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.