Begin typing your search above and press return to search.

రూ.వెయ్యి నోట్లను బ్యాన్ చేయాలన్న బాబు

By:  Tupaki Desk   |   17 July 2016 4:16 AM GMT
రూ.వెయ్యి నోట్లను బ్యాన్ చేయాలన్న బాబు
X
ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నలుగురు ముఖ్యమంత్రులు మినహా మిగిలిన సీఎంల ముందు ప్రసంగించిన చంద్రబాబు ఒక కీలక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలోనూ.. ప్రచార మాధ్యమాల్లోనూ తరచూ ప్రస్తావనకు వస్తూ.. చర్చ జరిపే ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అవినీతి నిర్మూలనకు మరిన్నిసంస్కరణలు తీసుకురావాలన్న చంద్రబాబు.. దీనికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు.

బ్లాక్ మనీపై దెబ్బ కొట్టటానికి వెయ్యి రూపాయిల నోట్లను బ్యాన్ చేయాలన్నారు. అవినీతి అంశంపై ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేస్తున్న నేపథ్యంలో అవినీతి అంశాన్ని అంతర్రాష్ట్ర సమావేశంలో ఒక అజెండాగా చేర్చాలన్న ఆయన.. ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం సిఫార్సు చేసిన పలు అంశాల్నిప్రస్తావించటం గమనార్హం. రూ.3లక్షలకు పైగా నగదు లావాదేవీలను నిషేధించాలని.. చేతిలో ఉంచుకునే నగదు నిల్వ రూ.10లక్షలకు పరిమితం చేయాలన్న అంశంపై తన మద్దతును ప్రకటించారు. ఏపీలో అవినీతి తీవ్రంగా ఉందని.. అవినీతిలో అగ్రస్థానంలో ఉందంటూ ఏపీ సర్కారు మీద విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. చంద్రబాబు అవినీతిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధం కావాలంటూ ప్రసంగించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.