Begin typing your search above and press return to search.

శిద్దా ఫ్యామిలీని బాబు ఏం చేయ‌నున్నారు?

By:  Tupaki Desk   |   12 March 2019 4:53 AM GMT
శిద్దా ఫ్యామిలీని బాబు ఏం చేయ‌నున్నారు?
X
ఎన్నిక‌ల వేళ అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసే విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి క‌మ్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రించే వైఖ‌రిని ప‌లువురు త‌ప్పు ప‌డుతుంటారు. టికెట్ల విష‌యంపై నెల‌ల ముందే క‌స‌ర‌త్తు షురూ అయిన వేళ‌.. లాస్ట్ మినిట్ గంద‌ర‌గోళానికి బాబు ఎప్పుడూ అవ‌కాశం ఇస్తూ ఉంటార‌ని చెబుతారు. కాంబినేష‌న్ల‌ను ఆలోచించ‌టం మంచిదే కానీ.. అవ‌స‌రానికి మించిన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం బాబులో క‌నిపిస్తూ ఉంటుంది. చ‌క్క‌గా సాగే నావ‌ను.. త‌న‌కు తాను చెడ‌గొట్టుకోవ‌టంలో ఆయ‌న‌కు మించినోళ్లు ఉండ‌ర‌ని చెబుతారు.

ఒక‌వేళ‌.. కీల‌క‌మైన నేత‌ల సీట్లు మార్చాల్సి వ‌స్తే.. ఆ క‌స‌ర‌త్తు మొద‌టే చేయ‌టం.. అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆఖ‌రి నిమిషంలో తీసుకునే నిర్ణ‌యాల‌కు సంబంధించిన క్లారిటీ బాబులో మిస్ అవుతుంద‌ని చెబుతారు. ఒక‌వేళ అనుకోని ప‌రిస్థితుల్లో నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తే.. దానికి సంబంధించిన మిగిలిన అంశాల‌ను కూడా ఒక కొలిక్కి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ.. స‌గం మాత్ర‌మే చేసే బాబుతో తెలుగు త‌మ్ముళ్ల బీపీ అన‌వ‌స‌రంగా పెరిగిపోవ‌ట‌మే కాదు.. మాన‌సిక ప్ర‌శాంత‌త మిస్ అవుతుంద‌న్న అభిప్రాయం ఉంది.

ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు ప్రాతినిధ్యం వ‌హించే ఈ స్థానం టీడీపీకి మంచి ప‌ట్టుంది. స్థానికంగా శిద్దా కుటుంబానికి ఉన్న ఇమేజ్ కార‌ణంగా టీడీపీ అక్క‌డ బ‌లంగా ఉంది. అయితే.. శిద్దాకున్న అర్థ‌బ‌లం.. అంగ‌బ‌లంతో ఆయ‌న్ను ఒంగోలు ఎంపీ బ‌రిలోకి దింపాల‌ని బాబు డిసైడ్ చేశారు. దీంతో.. శిద్దా కుటుంబానికి షాక్ త‌గిలినంత ప‌నైంది.

సిట్టింగ్ స్థానాన్ని వ‌దిలేసి.. ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయ‌టం అంటే మాట‌లు కాదు. సులువుగా గెలిచే స్థానాన్ని వ‌దిలేసి.. ఒంగోలు ఎంపీ బ‌రిలోకి దిగ‌ట‌మంటే మొద‌టి నుంచి మొద‌లు పెట్టాల్సిందే. కేవ‌లం నెల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఎన్నిక‌లు ఉండ‌టం.. ప్ర‌చారానికి సైతం స‌రిగా టైం లేని వేళ‌.. ఎంపీ స్థానానికి స‌న్న‌ద్ద‌త కావ‌టమంటే నిప్పుల న‌డ‌కే అవుతుంది. అందుకే.. ద‌ర్శి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయ‌టానికే శిద్దా ఫ్యామిలీ మ‌క్కువ చూపుతోంది.

అయితే.. అధినేత ఆదేశాల నేప‌థ్యంలో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి. నేత‌లు..కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు శిద్దాను ద‌ర్శి నుంచి బ‌రిలోకి దిగాల‌ని.. ఒక‌వేళ కుద‌ర‌ని ప‌క్షంలో తాము మ‌రెవ‌రికీ ప‌ని చేయ‌మ‌ని తేల్చి చెబుతున్నారు. దీంతో.. శిద్దా ప‌రిస్థితి మింగాలేక‌.. క‌క్కాలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌వైపు అధినేత మాట‌ను కాద‌న‌లేని ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో విప‌రీత‌మైన ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేయ‌ట‌మా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఈ నేప‌థ్యంలో బాబు కోరిన‌ట్లుగా ఒంగోలు ఎంపీగా పోటీ చేయ‌టంతోపాటు.. ద‌ర్శి అసెంబ్లీ టికెట్ ను త‌మ కుటుంబానికే కేటాయించాల‌న్న రిక్వెస్ట్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. దీనిపై బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అర్థం కాని ప‌రిస్థితి. త‌న గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే అనుకున్న శిద్దాకు.. ఒంగోలు ఎంపీ టికెట్ మాట‌తో ఆయ‌నకు.. ఆయ‌న‌ ఫ్యామిలీకి బాబు త‌న మార్క్ షాకిచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.