Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ తమ్ముడికి బాబు క్లాస్

By:  Tupaki Desk   |   13 Dec 2015 5:01 AM GMT
ఎమ్మెల్సీ తమ్ముడికి బాబు క్లాస్
X
పొగిడితే పోయేదేమీ ఉండదని అనుకుంటారు కానీ.. మోతాదు మించితే పొగడ్త కూడా కరెంటు షాకులా మారుతుందన్న విషయం తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కు తెలిసి వచ్చి ఉంటుంది. టీవీ చర్చల్లో తెలుగుదేశం పార్టీ విధానాల్ని.. స్టాండ్ ను బలంగా వినిపిస్తూ మంచి మాటకారిగా పేరున్న రాజేంద్రప్రసాద్ కు చంద్రబాబు.. ఆ మధ్యన ఎమ్మెల్సీ కట్టబెట్టిన సంగతి తెలిసిందే. బాబు మీదున్న భక్తితో.. వెనుకాముందు చూసుకోకుండా చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఇరుకున పడేసేలా చేశాయి.

చంద్రబాబు.. వెంకయ్యనాయుడుల సమర్థత గురించి గొప్పగా చెప్పుకునే క్రమంలో 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రధాని.. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారంటూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అటు బీజేపీ.. ఇటు తెలుగుదేశం పార్టీలో కలకలాన్ని రేపాయి. 2019లలో కూడా మోడీ ప్రధాని కావాలన్న వ్యూహంతో పని చేస్తున్న నేపథ్యంలో.. తెలుగుతమ్ముడు ఒకరు అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. ఇక.. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిని చేసేసిన రాజేంద్రప్రసాద్ మాటలు కూడా చర్చనీయాంశాలుగా మారాయి.

ప్రధాని మోడీ మనస్తత్వం ఏమిటో తెలిసి కూడా.. వెనుకాముందు చూసుకోకుండా తనను పొగిడేసిన తీరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిరాకు పుట్టించింది. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో పదే పదే చర్చకు రావటం.. దీని వల్ల కలిగే డ్యామేజ్ ను కంట్రోల్ చేయటం బాబుకు ఇబ్బందిగా మారింది. తాజాగా జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో.. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై బాబు క్లాస్ పీకారు. ఈ తరహా వ్యాఖ్యలు ఏ మాత్రం మంచివి కావటూం మండిపడిన ఆయన.. తనకు డిల్లీ మీద మోజు లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది.

ఢిల్లీకి వెళ్లాలని తాను ఎప్పుడూ అనుకోలేదని.. ఇప్పుడూ అనుకోవటం లేదని చంద్రబాబు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల బీజేపీతో లేని పోని సమస్యలతో పాటు.. ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. మొత్తానికి.. పొగిడి మరీ తిట్టించుకున్న చిత్రమైన పరిస్థితిని రాజేంద్రప్రసాద్ ఎదుర్కొంటున్నారు.