Begin typing your search above and press return to search.

బాబు బేజారు!... సుజ‌నాకు వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   23 March 2018 8:56 AM GMT
బాబు బేజారు!... సుజ‌నాకు వార్నింగ్‌!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు ఏపీలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు తెర తీస్తోంద‌నే చెప్పాలి. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై త‌మ‌కు అపార‌మైన న‌మ్మ‌కం ఉందంటూ మొన్న‌టిదాకా డాంబికాలు ప‌లికిన టీడీపీ ప్ర‌భుత్వం ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో ప‌డిపోయింది. ఆది నుంచి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేనంటూ నినదిస్తున్న విప‌క్ష వైసీపీ పోరాటంతో ఇప్పుడు బాబు స‌ర్కారు కూడా హోదా పోరును భుజానికెత్తుకోక త‌ప్ప‌లేదు. ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా ఏకంగా న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డంతో నిజంగానే టీడీపీకి ఏం చేయాలో కూడా పాలుపోని ప‌రిస్థితి ఎదురైంది. తొలుత రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం వైసీపీ అవిశ్వాస తీర్మానానికి తాము కూడా మ‌ద్ద‌తు ప‌లుకుతామంటూ ప్ర‌క‌టించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు.. ఆ త‌ర్వాత వ్యూహం మార్చేసి తామే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామంటూ ప్ర‌క‌టించారు.

అయితే ఈ రెండు పార్టీల అవిశ్వాస తీర్మానాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని బీజేపీ స‌ర్కారు వాటిని పార్ల‌మెంటులో చర్చ‌కు రాని విధంగా వ్యూహం అమ‌లు చేసింది. వ‌రుస‌గా ఐదు రోజుల పాటు అవిశ్వాస తీర్మానాలు చ‌ర్చ‌కు రాకుండా చేసిన బీజేపీ స‌ర్కారు... కాసేప‌టి క్రితం పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌ను వాయిదా వేసింది. రాజ్య‌స‌భ సోమ‌వారానికి వాయిదా ప‌డితే... లోక్ స‌భ ఏకంగా మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అమ‌లు చేస్తున్న వ్యూహంతో ఇప్పుడు చంద్ర‌బాబుకు బీపీ పెరిగిపోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏపీకి న్యాయం చేసే విష‌యంలో తాము ఎంత‌మాత్రం వెన‌క్కు త‌గ్గేది లేద‌న్న మాట‌ను వినిపిస్తున్న బీజేపీ... అందులో భాగంగా మొన్న‌టిదాకా కేంద్ర కేబినెట్ లో మంత్రిగా కొన‌సాగిన టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రికి క‌బురు పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నుంచి వ‌చ్చిన ఈ పిలుపున‌కు సుజ‌నా కూడా సానుకూలంగానే స్పందించిన‌ట్లుగా స‌మాచారం. ఓ సారి వ‌స్తే... క‌లిసి కూర్చుని ఏపీకి ఏం చేయాల‌న్న విష‌యంపై చ‌ర్చిద్దామంటూ జైట్లీ... సుజ‌నాకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

ఈ భేటీకి సుజ‌నా వెళ్ల‌క‌ముందే దీనిపై స‌మాచారం అందుకున్న చంద్ర‌బాబు... సుజ‌నాకు ఏకంగా వార్నింగ్ ఇచ్చేశార‌ట‌. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ... మిత్ర‌ప‌క్షంగా ఉన్న త‌మ‌ను కూడా నాలుగేళ్ల పాటు ఏమార్చింద‌ని, ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రుల‌తో వ‌రుస‌గా భేటీలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ‌తాయంటూ ఆయ‌న సుజ‌నాకు క్లాస్ పీకార‌ట‌. సుజ‌నా వ‌రుస‌గా జైట్లీతో స‌మావేశం అవుతున్న తీరుపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యన‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన‌ట్లుగా స‌మాచారం. ఈ క్ర‌మంలోనే సుజ‌నాకు చంద్ర‌బాబు త‌లంటార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. బీజేపీ అనుస‌రిస్తున్న వ్యూహం కార‌ణంగా బాబుతో సుజ‌నాకు చీవాట్లు ప‌డితే... ఇక రాష్ట్రంలో ప‌రిస్థితి మ‌రోలా ఉంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు వ్య‌వ‌హార స‌ర‌ళితో 25 నుంచి 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ఆ పార్టీ వ‌ర్గాలే పేర్కొంటున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సుజ‌నాకు బాబు వార్నింగ్... ప‌రిస్థితిని ఎంత‌దాకా తీసుకెళుతుందోన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తంగా బీజేపీ వ్యూహంతో బాబుకు బీపీ పెరిగిపోతుండ‌గా, టీడీపీ ఎమ్మెల్యేల్లో పార్టీ అధినేత‌పై అంత‌కంత‌కూ అసంతృప్తి పెరిగిపోతోంది. మ‌రి ఈ త‌ర‌హా విప‌త్క‌ర ప‌రిస్థిని బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.