Begin typing your search above and press return to search.

ఒకరిద్దరిని బాబు వదులుకుంటారా?

By:  Tupaki Desk   |   22 Dec 2015 5:23 AM GMT
ఒకరిద్దరిని బాబు వదులుకుంటారా?
X
తాను నొచ్చుకున్నా ఫర్లేదు.. తన వారు మాత్రం నొచ్చుకోకూడదన్నట్లుగా మారిన చంద్రబాబు.. తన వైఖరిని మార్చుకోనున్నారా? సెకండ్ ఇన్నింగ్స్ లో మితిమీరిన మంచితనాన్ని ప్రదర్శిస్తూ.. తన వారిని వెనకేసుకురావటం.. ఏం చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరించటం లాంటి వాటితో విసిగిపోయారా? తాను ఎంతగా ప్రయత్నించినా.. తన వారి వల్ల తనకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించారా? అయిన వాళ్లే కదా అన్న భావనను.. అలుసుగా తీసుకుంటున్న పార్టీ నేతల వైఖరిని భరించలేని స్థితికి వచ్చేశారా? అంటే.. అవుననే చెప్పాలి.

తన మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తూ.. తామేం చేసినా తమ బాబు ఏమీ చేయరన్న ధీమాను ప్రదర్శిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తమ్ముళ్ల విషయంలో చంద్రబాబు తొలిసారి.. పార్టీ సమావేశంలో కాకుండా.. శాసనమండలిలో వ్యాఖ్యలు చేయటం చూస్తే.. చంద్రబాబు ఎంత సీరియస్ గా ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. కొందరికి తెలివి ఎక్కువై.. వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారని.. అలాంటి అసాంఘికశక్తుల్ని అణచివేసి.. శాంతియుత వాతావరణాన్నికల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ఇందుకు అవసరమైతే.. ఒకరిద్దరిని వదులుకోవటానికైనా తాను సిద్ధమేనని తేల్చి చెప్పారు.

ఈ మధ్య కాలంలో పలువురు అధికారపక్ష నేతల వైఖరి వివాదాస్పదంగా మారింది. ఇసుక వ్యవహారంలో కావొచ్చు.. అధికారుల బదిలీల విషయంలోనూ.. తాజా కాల్ మనీ ఇష్యూలోనూ.. విపక్ష నేతలతో చెట్టాపట్టాలు వేసుకున్న తీరుపై బాబు తీవ్ర అగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అధినేతలకు ఎంత అగ్రహం ఉన్నా.. పార్టీలో జరిగే అంతర్గత సమావేశాల్లో వార్నింగ్ లు ఇస్తుంటారు. అలాంటిది.. శాసనమండలిలో బాహాటంగానే.. ఒకరిద్దరిని వదులుకోవటానికి తాను సిద్ధమన్నారంటే.. చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. హద్దులు మీరిన నేతలపై కొరడా ఝుళిపించేందుకు ఆయన సమాయుత్తమైనట్లే. మాటల్లో చూపించిన తీవ్రత చేతల్లో కూడా ప్రదర్శిస్తే.. కట్టు దాటుతున్న తమ్ముళ్లు.. దారికి వచ్చే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. మాటలు చెప్పినంత సులువుగా బాబు.. చేతల్లో చేసి చూపించగలరా?