Begin typing your search above and press return to search.

ఆ మంత్రుల‌ను హెచ్చ‌రించిన బాబు

By:  Tupaki Desk   |   16 Dec 2016 5:34 AM GMT
ఆ మంత్రుల‌ను హెచ్చ‌రించిన బాబు
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులు - ఎమ్మెల్యేలు - పార్టీ నేత‌ల‌కు హెచ్చరికలు జారీ చేశారు. అయితే అంద‌రికీ కాదు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ప్రక్రియలో త‌మ రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ మంత్రులు - ఎమ్మెల్యేలు - పార్టీ నాయకుల‌కు ఈ హుకుం జారీ చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జ‌రిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా ప్రారంభానికి ముందే చంద్రబాబు ఈ అంశాన్ని వివరించ‌డం గ‌మ‌నార్హం. "అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ప్రక్రియలో మ‌న‌వాళ్లు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దు.. అసలు ఆ ఆస్తుల కొనుగోలుకు గాని, భాగస్వామ్యా నికి గాని ప్రయత్నాలు చేయెద్దు.. ఆదేశాల్ని మీరితే చర్యలు కఠినంగా ఉంటాయి" అంటూ బాబు హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. అయితే ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు - ఎమ్మెల్యేలు ఇందులో పూర్తిగా పాలుపంచుకున్న త‌ర్వాత బాబు చేసిన ఈ ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

దేశ‌వ్యాప్తంగా లక్షలాది మందిని ఆర్దికంగా ముంచేసి అగ్రిగోల్డ్ కు విజయవాడలో 90 కోట్ల విలువైన 13ఆస్తులు - హైద‌రాబాద్ స‌మీపంలోని కీసరలో 200కోట్ల విలు వైన 341ఎకరాల భూముల్ని హైకోర్టు ఆదేశాల మేరకు మొదటి దశలో విక్రయాలు జరుపుతున్నారు. ఈ నెల 27న ఇందుకు సంబంధించిన బిడ్స్‌ తెరవనున్నారు. కొద్దికాలం ఈ ఆస్తుల విష‌యంలో ఏపీకి చెందిన ఓ కీల‌క మంత్రి పేరు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బాబు హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. "అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయ ప్రక్రియ ఇప్పటికే అనేక వివాదాలకు దారితీసింది. లక్షలాదిమందిని అగ్రిగోల్డ్‌ ఆర్దికంగా ముంచేసింనందున ఇప్పుడీ ఆస్తులపై ప్రతిఒక్కరి కన్నుంది. దీని జోలి కెళ్ళడం ద్వారా ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ట మసక బారుతుంది" అంటూ చంద్రబాబు వివరించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల క్షేత్రస్థాయి విలువను తగ్గించి తక్కువ ధరకే వేలంలో పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు కూడా తన దృష్టికొచ్చిందన్నారు. ఇలాంటి ఆటల్ని సాగనిచ్చేదిలేదంటూ ఆయన హెచ్చరించారు. వీలైనంత అధిక మొత్తాన్ని రాబట్టి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు.

మ‌రోవైపు సదావర్తి సత్రానికి చెందిన భూముల వేలం ప్రక్రియ వివాదాస్పదం కావడంతో పార్టీతో సంబంధమున్న ఏ ఒక్కరూ అగ్రిగోల్డ్‌ వేలం జోలికెళ్ళొద్దంటూ చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. కాదని ఈ ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో నోట్ల కొరత కారణంగా ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా దీర్ఘంగా చర్చ జరిగింది. పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు. కరెన్సీ సరఫరాలో రిజర్వ్‌బ్యాంక్‌ వైఖరిని కూడా బాబు తప్పుబట్టారు. ఆర్‌బిఐ అధికారులు రాష్ట్రానికి 20వేల కోట్లు పంపామని ప్రకటనలిస్తున్నారు. కానీ రాష్ట్రానికింతవరకు 11,500కోట్లు వచ్చాయి. మరో రెండువేల కోట్లు శుక్రవారం రాష్ట్రానికి రానున్నాయి. మిగిలిన నోట్ల సంగతేంటో అర్ధంకావడంలేదంటూ చంద్రబాబు సహచరుల వద్ద వ్యాఖ్యానించినట్లుతెలిసింది. త‌న రాజకీయ జీవితంలో ఇంత సుదీర్ఘకాలం ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ముందెప్పుడూ లేవని కూడా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

1996తుపాన్‌ నుంచి హుదూద్‌ తుపాన్‌ వరకు గరిష్టంగా పదిరోజుల్లోపే ప్రజాజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలిగాం.. కానీ 38 రోజులౌతున్నా ప్రస్తుత పరిస్తితులు మార్పురావడం లేదని చంద్ర‌బాబు అన్నారు. పైగా రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఈ విషయంలో తగిన సహకారం అందడంలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరముంది. అయితే నోట్ల రద్దు అనంతర పరిణామాల‌తో రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా పడిపోతోంది. దీన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఎలాంటి హామీలివ్వడంలేదని కూడా ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/