Begin typing your search above and press return to search.

కేసీఆర్ యాగానికి చంద్రబాబు వెళతారా..?

By:  Tupaki Desk   |   4 Nov 2015 4:17 AM GMT
కేసీఆర్ యాగానికి చంద్రబాబు వెళతారా..?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆసక్తికర భేటీ గురించిన చర్చ మరోసారి మొదలైంది. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి.. తెలంగాణ ముఖ్యమంత్రిని పిలుస్తారా? లేదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై చర్చ జోరుగానే సాగింది. చివరకు విలేకరుల సమావేశంలో ఇదే ప్రశ్నను చంద్రబాబును ప్రశ్నించటం.. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రిని తాను స్వయంగా ఆయనింటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చెప్పారు.

అందుకు తగ్గట్లే చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటకి వెళ్లటం ఆహ్వానించటం.. గంటపాటు ఏకాంతంగా చర్చించుకోవటం జరిగింది. తన ఇంటికి వచ్చిన చంద్రబాబును సాదరంగా ఇంటి బయట నుంచి ఇంట్లోకి కేసీఆర్ తీసుకెళితే.. అందుకు బదులు అన్నట్లుగా అమరావతి శంకుస్థాపనకు వచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విషయాలు చూసుకోవాలంటూ ఏకంగా ఒక మంత్రికే బాధ్యత అప్పగించారు. అంతేకాదు.. శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్ మనసు నొచ్చుకోకుండా ఆయనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

శంకుస్థాపన సమయంలో తన పక్కనే పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని అతిధి మర్యాదలు చేసి పంపారు. ఇప్పుడు అతిధ్యం ఇచ్చే అవకాశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చింది. డిసెంబరు 23 నుంచి 27 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి రాష్ట్రపతిని ఇప్పటికే ఆహ్వానించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తారా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆహ్వానిస్తే చంద్రబాబు వస్తారా? అన్న ప్రశ్నలపై చర్చ సాగుతోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తారనే చెబుతున్నారు. అయితే.. ఆహ్వానం ఎలా ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరం. విజయవాడలోనే ఎక్కువ కాలం ఉంటున్న చంద్రబాబును పిలిచేందుకు ఏపీకి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం ఇస్తారా? లేక.. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్లి ఇస్తారా? లేదంటే.. మంత్రుల బృందాన్ని పంపుతారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి. ఏది ఏమైనా ఆయుత చండీయాగం కారణంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మరింత సోదరభావం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాదు.. చండీయాగం కారణంగా.. మరిన్ని ఆసక్తికర సన్నివేశాలకు కారణం కావటం ఖాయంగా కనిపిస్తోంది.