Begin typing your search above and press return to search.

చింత‌మ‌నేనిపైనా బాబు వేటేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   17 April 2017 4:18 AM GMT
చింత‌మ‌నేనిపైనా బాబు వేటేస్తార‌ట‌!
X
పార్టీపైనా - పార్టీ అధినాయ‌క‌త్వంపైనా - పార్టీ ప్ర‌భుత్వంపైనా సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్న త‌రుణంలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి ఏం చేయాలో కూడా పాలుపోవ‌డం లేద‌ట‌. బాబుకు కాలేలా క‌ర‌కు వ్యాఖ్య‌లు చేసిన నేత‌లు ఓ గ‌ల్లీ నేత‌లో కాదు... పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఉన్న చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్‌ తో పాటు ఏపీ అసెంబ్లీలో ప్ర‌భుత్వ విప్‌ గా ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ లాంటి హేమాహేమీలు ఉన్నారు. మ‌రి వారిని చ‌ల్ల‌బ‌ర‌చేందుకు బాబు అండ్ కో ఏమీ చేయ‌లేదా? అంటే.. శివ‌ప్ర‌సాద్ విష‌యంలో ఏం చేసిందో తెలియ‌దు గానీ... చింత‌మ‌నేని వ‌ద్దకు ఏకంగా దూత‌ల‌ను పంపిన చంద్ర‌బాబు... ఆయ‌న‌ను దారికి తెచ్చుకునేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. అయినా కూడా శివ‌ప్ర‌సాద్ లాగానే చింత‌మ‌నేని కూడా సింగిల్ మెట్టు కూడా దిగ‌లేదు.

శివ‌ప్ర‌సాద్ విష‌య‌మైతే... మొన్న తెర‌పైకి వ‌చ్చింది గానీ... చింత‌మ‌నేని విష‌యం మాత్రం ర‌చ్చ‌కెక్కి ఇప్ప‌టికే దాదాపుగా 15 రోజులు కావ‌స్తోంది. మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణలో త‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్న భావ‌న‌తో చింత‌మ‌నేని అల‌క‌బూనిన విష‌యం తెలిసిందే. చింత‌మనేని అల‌క‌బూనారు అనే కంటే కూడా ఆగ్ర‌హోద‌గ్రుడ‌య్యారంటే స‌రిపోతుందేమో. ఎందుకంటే... పార్టీ అధిష్ధానం తీసుకున్న నిర్ణ‌యాన్ని బ‌హిరంగంగా విమ‌ర్శించ‌డ‌మే కాకుండా ఏకంగా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి స‌ద‌రు లేఖ‌ను నేరుగా స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ కు పంపారు. అయితే ఆ త‌ర్వాత కాస్తంత కామ్ అయినా... చింత‌మ‌నేని స‌ద‌రు రాజీనామా లేఖ‌ను ఉప‌సంహ‌రించుకోలేదు. అంతేకాకుండా సొంతంగా పార్టీ పెడ‌తానంటూ నాడు చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మేన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా కూడా ఆయ‌న వైఖ‌రి ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలే గుస‌గుస‌లాడుకుంటున్నాయి. చింత‌మ‌నేని వ్య‌వ‌హారంతో అప్ప‌టికే తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న చంద్ర‌బాబు... శివ‌ప్ర‌సాద్ ఏకంగా త‌న‌నే టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో ఇక నిద్ర మేల్కోక త‌ప్ప‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే నిర‌స‌న గ‌ళం వినిపించిన వారిలో ఒక‌రిపైనో, లేదంటే ఇద్ద‌రిపైనో వేటు వేస్తే త‌ప్పించి మిగిలిన వారంతా దారికి రార‌న్న భావ‌న‌కు చంద్ర‌బాబు వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో శివ‌ప్ర‌సాద్‌ పై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని ఇప్ప‌టికే గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు... చింత‌మనేనిపైనా కొర‌డా ఝుళిపించాల్సిందేన‌ని తీర్మానించార‌ట‌. ఇందుకు చంద్ర‌బాబు చెబుతున్న కార‌ణం కూడా కాస్తంత ఆసక్తిగానే ఉంది. చింత‌మ‌నేని స‌మ‌ర్పించిన రాజీనామా లేఖ ఇంకా స్పీక‌ర్ వ‌ద్ద‌నే ఉంద‌ని, ఆ లేఖ‌నే ఆమోదిస్తున్న‌ట్లుగా చెప్పేస్తే స‌రిపోతుంద‌న్న‌ది చంద్ర‌బాబు భావ‌న‌గా వినిపిస్తోంది. అంటే... ఏదో నాలుగు మాట‌లు అని అధిష్ఠాన్ని దారికి తెచ్చుకుందామ‌ని భావించిన చింత‌మ‌నేనిపై ఏకంగా స‌స్పెన్ష‌న్ వేటే ప‌డ‌బోతోంద‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/