Begin typing your search above and press return to search.

ఇక.. కేంద్రం ముందు చేతులు కట్టుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   10 Jun 2015 5:31 AM GMT
ఇక.. కేంద్రం ముందు చేతులు కట్టుకోవాల్సిందేనా?
X
ఒక్క వ్యూహవైఫల్యం ఎంతటి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తుందో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికైనా తెలిసి వస్తుందేమో. ఓటుకు నోటు స్టింగ్‌ ఆపరేషన్‌ యవ్వారం చాలా అంశాల మీద ప్రభావం చూపిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ కేంద్రం దగ్గర అరచేతి మందాన పరువు ప్రతిష్ఠలున్న చంద్రబాబుకు.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని చెబుతున్నారు.

ఇప్పటివరకూ చంద్రబాబు మీద వేలెత్తి చూపించటానికి అవకాశం లేని పరిస్థితి. కానీ.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటుకు నోటు స్టింగ్‌ ఆపరేషన్‌ ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందని.. కేంద్రం దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితిని తెస్తుందని చెబుతున్నారు. ఈ వ్యవహారం రెండు తెలుగురాష్ట్రాల మధ్య ఎంతటి దూరాన్ని తెచ్చిందో ప్రత్యేకింది చెప్పాల్సిన అవసరం లేదు.

తాను కన్ను తెరిస్తే.. ఏదేదో అయిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెలరేగిపోయి చెబితే.. ఎక్కువ మాట్లాడితే ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు సుమా అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తానేం చేస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఓటుకు నోటు స్టింగ్‌ ఆపరేషన్‌ కుట్ర పూరితమైందా? కాదా? లాంటి అంశాలు ఇప్పట్లో తేలేవి కావు. కానీ.. రాజకీయంగా మాత్రం ఇరుకున పెట్టి.. ఇబ్బంది పెట్టేవే.

తాజా పరిణామాల నేపథ్యంలో.. పీ ప్రయోజనాల కోసం గొంతు విప్పలేని పరిస్థితి. ఇప్పటికే కేంద్రంలో మోడీ సర్కారుకున్న బలంతో చాలా విషయాల్లో రాజీ పడిపోతున్న చంద్రబాబు.. రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి నుంచి బాబును బయటపడేసే అవకాశం కేంద్రం దగ్గర మాత్రమే ఉంది. ఒకవేళ మిత్రధర్మంతో సాయం చేసిన పక్షంలో.. దానికి బదులు చెల్లించాల్సి ఉంటుంది. అదే జరిగితే చాలా విషయాల్లో రాజీ పడాలి. అదే జరిగితే.. కేంద్రం ముందు చేతులు కట్టుకొని బుద్ధిగా ఉండాల్సిదే తప్పించి మరో మార్గం ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఎంతలో ఎంత మార్పు..? చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అంటే ఇదేనేమో.