Begin typing your search above and press return to search.

మోడీ చెవిలో బాబు.. బాబు చెవిలో మోడీ!

By:  Tupaki Desk   |   11 April 2017 3:39 AM GMT
మోడీ చెవిలో బాబు.. బాబు చెవిలో మోడీ!
X
ఎన్డీయే ప‌క్షాల‌కు చెందిన పార్టీ స‌మావేశం దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌ధ్య న‌డిచిన మాట‌లు.. క్లోజ్ గా మూవ్ అవుతున్న విష‌యాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. అటుస్వ‌ప‌క్షంలోనూ.. ఇటు ప్ర‌తిప‌క్షంతోనూ ఇబ్బందుల‌కు గురి అవుతున్న చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోడీ త‌ర‌చూ మాట్లాడుతున్న వైనం అంద‌రి దృష్టిలోనూ ప్ర‌త్యేకంగా రిజిష్ట‌ర్ అయ్యింది.

అయితే.. వీరిద్ద‌రి మధ్య చ‌ర్చ‌ల సారాంశం ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు కానీ.. మోడీ చెవిలో బాబు.. బాబు చెవిలో మోడీ త‌ర‌చూ మాట్లాడుకోవ‌టం గ‌మ‌నార్హం. 33పార్టీల అగ్ర‌నేత‌లు పాల్గొన్న ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీకి ఒక‌వైపున బీజేపీ చీఫ్ అమిత్ షా కూర్చుంటే.. మ‌రోప‌క్క ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూర్చోవ‌టం విశేషం.

మూడేళ్ల వార్షికోత్స‌వంపై చ‌ర్చించ‌టంతో పాటు.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌పై కూడా క‌స‌ర‌త్తు జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. మూడేళ్ల త‌మ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌పై ప్ర‌ధాని మోడీ ప్ర‌జంటేష‌న్ త‌ర్వాత ఇచ్చిన విందులో ప్ర‌ధాని మోడీ.. బీజేపీ చీఫ్ అమిత్ షా.. కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒకే టేబుల్ ద‌గ్గ‌ర కూర్చున్నారు. సమావేశంలో చ‌ర్చించిన అంశాల్ని విలేక‌రుల‌తో చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలోనూ.. కేంద్ర‌మంత్రి జైట్లీ.. చంద్ర‌బాబులు ఇద్ద‌రు మాత్రమే రావ‌టం గ‌మ‌నార్హం.

విందు చేస్తున్న వేళ‌.. చంద్ర‌బాబును ప్ర‌ధాని మోడీ ప‌క్క‌కు తీసుకెళ్లి కాసేపు ఏకాంతంగా చ‌ర్చించ‌టం క‌నిపించింది. రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తిపై చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త అభిప్రాయం తెలుసుకోవ‌టానికే ఇదంతా అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. చివ‌ర్లోనూ చంద్ర‌బాబును వీడ్కోలు ప‌లికే విష‌యంలోనూ మోడీకాస్త ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లుగా చెప్పొచ్చు. కొంత‌దూరం చంద్ర‌బాబుతో న‌డిచి.. ఆయ‌న్ను సాగ‌నంపారు. నిజ‌మే.. తానా అంటే తంధానా అంటూ.. రాష్ట్ర ప్ర‌యోజనాల్ని ప‌ణంగా పెట్టే చంద్ర‌బాబు నాయుడు లాంటి వారితో మోడీ లాంటి రాజ‌కీయ నేత క్లోజ్ గా ఎందుకు ఉండ‌రు. త‌మ‌కు న‌చ్చిన‌ట్లుగా.. త‌మ‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాలంటే ఓకే అనేసే బాబుకు మోడీ ప్రాధాన్య‌త ఎందుకు ఇవ్వ‌రు?