Begin typing your search above and press return to search.

బాబుకు మంట పుట్టేలా రాజ్ నాథ్ మాట్లాడారా?

By:  Tupaki Desk   |   4 Nov 2017 5:30 AM GMT
బాబుకు మంట పుట్టేలా రాజ్ నాథ్ మాట్లాడారా?
X
కొన్నిసార్లు అంతే. అన్ని తెలిసినా తెలియ‌న‌ట్లు ప్ర‌య‌త్నించాలి. త‌న కోసం కాకున్నా.. చుట్టు ఉన్న మంది కోస‌మైనా కొన్ని మాట‌లు మాట్లాడాలి. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ల్ని చూసిన‌ప్పుడు అనిపించేదిదే. అసెంబ్లీ సీట్ల పెంపు విష‌యంపై విభ‌జ‌న చట్టంలో పేర్కొన్నా.. అందుకు మోడీ స‌ర్కారు సిద్ధంగా లేని వైనం తెలిసిందే.

పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఇబ్బందిక‌రంగా ఉన్న ఏడు మండ‌లాల్ని ఏపీకి తీసుకొస్తే త‌ప్పించి.. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌న‌ని మోడీ ద‌గ్గ‌ర మొండికేసి మ‌రీ అనుకున్న‌ది సాధించుకున్న చంద్ర‌బాబుకు ఇప్ప‌డు అలాంటి ప‌రిస్థితి లేద‌ని చెప్పాలి.
న‌యానో.. భ‌యానో ఏదో రీతిలో మోడీ మ‌న‌సు దోచుకొని అసెంబ్లీ సీట్ల పెంపు విష‌యంలో కేంద్రం నుంచి సానుకూల నిర్ణ‌యం వ‌చ్చేలా బాబు ప్ర‌య‌త్నించారు. అయితే.. సీట్ల పెంపు టీడీపీకి త‌ప్పించి త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర‌ద‌న్న విష‌యాన్ని గుర్తించి మోడీ అండ్ కో పాజిటివ్ గా రియాక్ట్ కాని ప‌రిస్థితి.

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌కు సీట్ల పెంపు దిశ‌గా కేంద్రం నిర్ణ‌యం తీసుకునేందుకు వీలుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విడివిడిగా ప్ర‌య‌త్నాలు చేశారు. ప‌లు విష‌యాల్లో ఇద్ద‌రి మ‌ధ్య పంచాయితీలు ఉన్న‌ప్ప‌టికీ..సీట్ల పెంపు అంశంపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఇద్ద‌రు చంద్రుళ్లు ఉమ్మ‌డిగా ఆలోచించినా మోడీ కార‌ణంగా వ‌ర్క్ వుట్ కాని ప‌రిస్థితి. ఒక‌ద‌శ‌లో సీట్ల పెంప‌కం సాధ్యం కాదంటే కాద‌ని తేల్చేసిన‌ప్ప‌టికీ.. కాడి కింద‌కు ప‌డేయ‌కుండా.. త‌న ప్ర‌య‌త్నాల్ని ఆప‌లేదు.

తాజాగా ఒక స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్ర‌బాబు.. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపు విష‌యాన్ని ఆయ‌న ద‌గ్గ‌ర ప్ర‌స్తావించారు. చిన్న రాష్ట్రాల్లో సీట్ల పెంప‌కం ద్వారా అభివృద్ధికి అవ‌కాశం ఉంటుద‌న్న మాట‌ను చెప్పారు. రాజ్ నాథ్ తో పాటు మోడీ స‌ర్కారులో కీల‌క‌మైన జైట్లీతోనూ బేటీ అయ్యారు. వీరితో భేటీ అయిన సంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతోనూ మాట్లాడారు.

సీట్ల పెంపుపై త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తున్నామ‌ని.. ఎన్నిక‌లు మ‌రో ఏడాదిన్న‌ర మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో రాబోయే శీతాకాల స‌మావేశాల్లో అయినా సీట్ల పెంపు బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ పెడితే.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న సాధ్య‌మ‌వుతుంద‌ని వ్యాఖ్యానించారు.

సీట్ల పెంపుతో పాటు.. రెండు రాష్ట్రాల మ‌ధ్య ప‌రిష్కారం కాని అంశాల విష‌యంలో స‌మీక్ష జ‌ర‌పాల‌ని రాజ్ నాథ్ ని కోరిన‌ట్లుగా చెప్పారు. ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ఒక ప్ర‌శ్న‌కు బాబు త‌న తీరుకు భిన్నంగా కాస్తంత చిరాకుతో స‌మాధానం చెప్ప‌టం క‌నిపిస్తుంది. సీట్ల పెంపు కోసం రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల‌ని కేంద్రం భావిస్తుందా? ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? అన్న ప్ర‌శ్న‌కు బాబు స్పందిస్తూ.. విభ‌జ‌న చ‌ట్టాన్ని ఇష్టానుసారం చేశార‌ని.. మ‌ళ్లీ ఇప్పుడు సీట్ల పెంపు కోసం ఎలాంటి విధానాన్ని అనుస‌రిస్తారో కేంద్ర‌మే స‌మాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు.

బాబు మాట తీరుకు ఈ మాట‌లు పూర్తి భిన్నం. ఆచితూచి మాట్లాడుతూ.. కేంద్రం మీద ప‌ల్లెత్తు మాట అన‌కుండా వ్య‌వ‌హ‌రించే బాబు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా చికాకుగా మాట్లాడ‌టం చూస్తే.. రాజ్ నాథ్‌.. జైట్లీ.. అమిత్ షాల నుంచి సీట్ల పెంపుపై పాజిటివ్ రెస్పాన్స్ రాన‌ట్లుగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ‌.. బాబు చెప్పిన‌ట్లుగా శీతాకాల స‌మావేశాల్లో బిల్లును పెట్టే విష‌యంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి ఉంటే.. మ‌రింత జోష్ గా చెప్పేవారు. మ‌రి.. సానుకూల స‌మాధానం రాకున్నా ఈ విష‌యాన్ని ఎందుకు ప్ర‌స్తావించి ఉంటార‌న్నది చూస్తే.. ఇక్క‌డే అస‌లు రాజకీయం ఉంద‌ని చెప్పాలి.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో విప‌క్షం నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల్ని పార్టీలోకి ఆహ్వానించి.. వారికి ప‌చ్చ కండువాలు క‌ప్పేశారు. జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టేందుకు వీలుగా.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను చేప‌ట్టినంత సులువుగా.. వారికి టికెట్లు కేటాయించ‌టం అంత చిన్న ముచ్చ‌ట కాదు. ఆ ఇబ్బందిని అధిగ‌మించే క్ర‌మంలో సీట్ల పెంపు కోసం తాను రెగ్యుల‌ర్ గా ఫాలోఅప్ చేస్తున్నాన‌ని.. కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోవ‌టం వ‌ల్ల‌నే తాను అనుకున్న‌ట్లు సీట్ల పెంపు చేప‌ట్ట‌లేక‌పోయాన‌న్న విష‌యాన్ని త‌న పార్టీ నేత‌ల‌కు ప‌రోక్షంగా చెప్పార‌ని చెప్పాలి. రేపొద్దున సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో నేత‌ల్ని బుజ్జ‌గించేందుకు ఇలాంటి ప్ర‌య‌త్నాల‌న్నీ అక్క‌ర‌కు వ‌స్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.