Begin typing your search above and press return to search.

బిజీ..వాడ

By:  Tupaki Desk   |   17 Aug 2015 12:56 PM GMT
బిజీ..వాడ
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన బెజవాడ ఇప్పుడు బిజీవాడ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండే ఈ నగరానికి ఇప్పుడు హడావుడి.. పరిపాలన తోడయ్యాయి. దాంతో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ కావడంతోపాటు పరిపాలనాపరమైన సమస్యలకు హైదరాబాద్ రాకుండా కేవలం విజయవాడ కే ప్రజలు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినా.. రాజధాని ఏర్పడడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది కనక అప్పటి వరకు పరిపాలన అక్కడికి రాదని ప్రతి ఒక్కరూ భావించారు. అదే సమయంలో వీలైనంత తొందరగా పరిపాలన విజయవాడ నుంచి ప్రారంభం అయితే బాగుంటుందని భావించారు. కానీ, మొదటి ఏడాది మొత్తం హైదరాబాద్ నుంచే పాలన ప్రారంభం అయింది. కానీ, రెండో ఏడాదిలో హైదరాబాద్ నుంచే పాలనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూటి పోటీ మాటలు మాట్లాడడం.. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులు ఇతరుల ఫోన్లను ట్యాప్ చేయడంతో ఇక ఇక్కడి నుంచి పాలన కొనసాగించడం మంచిది కాదని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సీఎం క్యాంపు కార్యాలయం, సీఎం నివాసాలను పూర్తి చేయించారు.

ఇప్పుడు విజయవాడ నుంచే నాలుగు రోజులపాటు పరిపాలన కొనసాగిస్తున్నారు. దాంతో దాదాపు అన్ని విభాగాల నాయకులు తాత్కాలిక ప్రాతిపదికన అయినా విజయవాడ రావాల్సి వస్తోంది. ఇక సీఎం క్యాంపు కార్యాలయం పూర్తిస్థాయిలో పూర్తి కావడంతో ముఖ్యమైన సమీక్షలన్నీ ఇక్కడి నుంచే చేస్తున్నారు. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కొన్ని శాఖల అధికారులు కూడా ఇప్పుడు విజయవాడలోనే మకాం వేయాల్సిన పరిస్థితి. దాంతో విజయవాడ బిజీ కావడమే కాకుండా పరిపాలనకూ కేంద్రమైంది.