Begin typing your search above and press return to search.

అమిత్ షా తో కరచాలనం...?

By:  Tupaki Desk   |   11 May 2022 2:30 PM GMT
అమిత్ షా తో కరచాలనం...?
X
ఆయన దేశానికి హోం మంత్రి. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన హోదాలో ఉన్నారు. ఇక బీజేపీకి కూడా సర్వం సహా ఆయనే. మోడీ ఆయన వేరు కానే కాదు. అలాంటి అమిత్ షా తో కరచాలనం చేయాలని తెలుగుదేశానికి చాలా కాలంగా ఉంది. ఆ మధ్యన అంటే గత ఏడాది పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని చంద్రబాబు హోం మంత్రికి ఫిర్యాదు చేశారు.

ఆ తరువాత ఢిల్లీ కూడా వెళ్ళి ప్రధానిని, హోం మంత్రిని కలవాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇక అమిత్ షా పుట్టిన రోజుకు శుభాకాంక్షలు కూడా చంద్రబాబు చెప్పారు. అయినా సరే బీజేపీ మనసేమిటో, మాటేమిటో కూడా టీడీపీ నేతలకు తెలియడంలేదు.

ఇపుడు మరోసారి అమిత్ షాకు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఏపీలో రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నారు అని బాబు అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ని ఆయన ప్రస్థావించినట్లుగా చెబుతున్నారు. నారాయణను అరెస్ట్ చేయడాన్ని అక్రమమని పేర్కొన్న చంద్రబాబు అమిత్ షా కి దీని మీద గట్టిగానే ఫిర్యాదు చేశారు.

మరి ఈ లేఖ మీద అమిత్ షా ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి. ఆయన దేశానికి హోం మంత్రి అయినా ఏపీ వ్యవహారాల మీద ఎంత మేరకు జోక్యం చేసుకుంటారు అన్నది కూడా చూడాలి. ఏపీలో వైసీపీ సర్కార్ ఉంది. అది కేంద్రంలోని బీజేపీతో సన్నిహితంగానే ఉంటోంది. పైగా ముందు ముందు రాజకీయ అవసరాలు ఉన్నాయి.

మరి ఈ సమయంలో టీడీపీ ఫిర్యాదు మేరకు అమిత్ షా రియాక్ట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి. సాధారణంగా ఢీ అంటే ఢీ కొట్టే రాష్ట్రాలలో రాజకీయం ఎపుడూ వేడిగానే ఉంటుంది. దానికి కచ్చితమైన ఉదాహరణ పశ్చిమ బెంగాల్. అక్కడ బీజేపీ విపక్షంలో ఉంటూ ఎన్ని రకాలుగా మమతా బెనర్జీ సర్కార్ చేతిలో ఇబ్బందులు పడుతోందో అందరికీ తెలుసు.

మరి తన సొంత పార్టీ ఇబ్బందులలో ఉన్నా అమిత్ షా ఎంతవరకూ జోక్యం చేసుకోవాలో అంతవరకే అన్నట్లుగా ఉంటున్నారు. అలాంటిది ఏపీలో జోక్యం చేసుకోగలరా. ఈ సంగతులు ఏవీ టీడీపీ అధినాయకత్వానికి తెలియవు అని అనుకోరు. అయితే ఇక్కడే ఉంది రాజకీయం. అమిత్ షా తన లేఖ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నదే చంద్రబాబుకు కావాలి.

ఆయన సానుకూలంగా రియాక్ట్ అయితే మాత్రం రేపటి రోజున బీజేపీతో చెలిమి చేసేందుకు ఎంతో కొంత ఆశ ఉంటుంది. అలా కాకుండా పట్టించుకోకపోతే మాత్రం మళ్లీ మళ్లీ ప్రయత్నాలు ఇలా చేస్తూనే ఉండాలి. ఏది ఏమైనా అమిత్ షా కోర్టులోకి బంతి ఒకటి వేసి టీడీపీ రిజల్ట్ కోసం చూస్తోంది అంటున్నారు. మరి షా ఏం చేస్తారు. వెయిట్ అండ్ సీ.