Begin typing your search above and press return to search.

బాబు న‌యా మంత్రం!... ఎన్‌ స్క్రిప్టెడ్ ఫోన్లు రెడీ!

By:  Tupaki Desk   |   25 Jan 2019 10:17 AM GMT
బాబు న‌యా మంత్రం!... ఎన్‌ స్క్రిప్టెడ్ ఫోన్లు రెడీ!
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఎన్నిక‌ల వ్యూహ‌ర‌చ‌న‌లో దాదాపుగా అంద‌రు రాజ‌కీయ‌వేత్త‌ల కంటే కాస్తంత ముందు ఉంటార‌నే చెప్పాలి. దాదాపుగా 4 ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతూ వ‌స్తున్న చంద్ర‌బాబు... అందివ‌స్తున్న సాంకేతిక‌త‌ను త‌న‌కు అనుకూలంగా ఎలా మ‌ల‌చుకోవాలో తెలిసిన దిట్ట‌గానే చెప్పాలి. టెక్నాల‌జీని స‌మ‌ర్ధ‌వంతంగా వినియోగించుకోవ‌డంలో బాబుది అందె వేసిన చెయ్యేన‌ని ఇప్ప‌టికే చాలా సార్లు రూడీ అయ్యింది కూడా. మిగిలిన స‌మ‌యాల్లో ఎలా ఉన్నా... ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చిందంటే టెక్నాల‌జీని బాబు వాడే విధానంపై ఇత‌ర పార్టీల‌తో పాటు మీడియా కూడా అమితాస‌క్తి చూపిస్తుండ‌టం మ‌న‌కు తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రో మూడు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో బాబు మ‌రో అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఈ అస్త్రం నిజంగానే వైర‌ల్‌ గా మారే అవ‌కాశం లేక‌పోలేదు. టెక్నాల‌జీ వినియోగంలో త‌న‌ను మించిన వాడు లేడంటున్న బాబు మాట‌ల‌కు ఈ కొత్త అస్త్రం ప‌క్కా నిద‌ర్శ‌న‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

చంద్ర‌బాబు ప్ర‌యోగిస్తున్న ఆ అస్త్రం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఎన్‌ స్క్రిప్టెడ్ మొబైల్ ఫోన్ అంట‌. సాధార‌ణంగా ఎన్‌ స్క్రిప్టెడ్ మెసేజ్‌ ల‌ను ఇత‌రులు చ‌ద‌వ‌డం దాదాపుగా కుద‌ర‌దు. అదే స‌మ‌యంలో ఎన్‌ స్క్రిప్టెడ్ మొబైల్ ఫోన్ల‌లోని స‌మాచారాన్ని కూడా చూడ‌టం కాని, నిఘా వ‌ర్గాలు ఆ స‌మాచారాన్ని సేక‌రించ‌డం, ప‌రిశీలించ‌డం గానీ సాధ్యం కాదు. ఇందుకే చంద్ర‌బాబు ఈ త‌ర‌హా ఎన్ స్క్రిప్టెడ్ ఫోన్ల‌ను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయినా ఈ ఫోన్ల‌ను పార్టీలో చంద్ర‌బాబు ఎవ‌రెవ‌రికి ఇస్తార‌న్న విష‌యానికి వ‌స్తే... ఎన్నిక‌లు అయ్యే దాకా త‌న‌తో పాటు ఆయా అసెంబ్లీ, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోటీ చేసే అంద‌రు అభ్య‌ర్థులు ఈ ఫోన్ల‌నే వాడాల‌ని నిర్ణ‌యించారు. ఎన్నిక‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తులు, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల పూర్తి స‌మాచారం, తాజా స‌మాచారంపై ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకునేందుకు, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లు చేయాల్సిన పార్టీ వ్యూహాన్ని అభ్యర్థుల‌కు అంద‌జేయ‌డం... నిధుల ప్ర‌వాహం, ఎన్నిక‌ల మేనేజ్ మెంట్‌, పార్టీ స్థితిగ‌తులు, ప్ర‌త్య‌ర్థి పార్టీల వ్యూహాలు, బ‌లాబలాలు... ఇలా ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌తి అంశాన్ని కూడా ఇక‌పై ఈ ఫోన్ల ద్వారానే బ‌ద‌లాయించుకుంటార‌ట‌.

ఎన్నిక‌లకు సంబంధించిన ఏ అంశాన్ని అయినా అభ్య‌ర్థ‌లు ఇక‌పై ఈ ఫోన్ ద్వారానే బాబు వ‌ద్ద‌నున్న ఎన్ స్క్రిప్టెడ్ ఫోన్ కే చేర‌వేయాల‌ట‌. అంతేకాకుండా ఆయా అభ్య‌ర్థుల‌కు బాబు నుంచి వెళ్లే ప్రతి స‌మాచారం కూడా ఈ ఎన్ స్క్రిప్టెడ్ ఫోన్ల ద్వారానే వెళుతుంద‌ట‌. అయినా ఇప్పుడు ఈ ఎన్ స్క్రిప్టెడ్ ఫోన్ల అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ ఫోన్ల ద్వారా జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌త్యుత్త‌రాలు, సంభాష‌ణ‌లు, టెక్ట్స్ మెసేజెస్‌ లు ట్యాపింగ్‌ కు చిక్క‌వ‌ట‌. టీడీపీకి అత్యంత కీల‌కంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో బాబు వ్యూహాల‌కు విరుగుడు క‌నుక్కునే క్ర‌మంలో విప‌క్షాల‌కు చెందిన నేత‌లు టీడీపీ నేత‌ల ఫోన్ల‌ను ట్యాప్ చేసే అవ‌కాశాలున్నాయ‌న్న‌ది బాబు అనుమానం. తెలంగాణ‌లో న‌మోదైన ఓటుకు నోటు కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా బుక్కైన‌దే. ఈ క్ర‌మంలో త‌మ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క చిన్న స‌మాచారం కూడా బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త ప‌డే క్ర‌మంలోనే చంద్ర‌బాబు... ఈ ఎన్ స్క్రిప్టెడ్ ఫోన్ల దిశ‌గా అడుగులు వేశార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఎన్ స్క్రిప్టెడ్ ఫోన్ల కోసం కొత్గా మొబైల్ ఫోన్ల‌ను కొనాల్సిన అవ‌స‌రం లేద‌ట‌. కేవ‌లం ఎన్‌ స్క్రిప్టెడ్ యాప్‌ ను ప్ర‌స్తుతం వాడుతున్న ఫోన్ల‌లో డైన్‌ లోడ్ చేసుకుంటే స‌రిపోతుంద‌ట‌. మొత్తంగా ఈ కొత్త త‌ర‌హా వ్యూహంతో చంద్ర‌బాబు... టెక్నాల‌జీ వినియోగంలో త‌న‌ను మించిన వాడు లేడ‌ని మ‌రోమారు నిరూపించార‌న్న మాట‌.