Begin typing your search above and press return to search.

మొన్న చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్‌.. అదే చ‌ర్చ‌!!

By:  Tupaki Desk   |   12 July 2022 3:19 AM GMT
మొన్న చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్‌.. అదే చ‌ర్చ‌!!
X
రాజ‌కీయ నాయ‌కుల వ్యాఖ్య‌లే కాదు.. వారి హావ భావాలు.. వేష‌ధార‌ణ‌ల‌కు కూడా ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి ఉంటుంది. కేవ‌లం వారు చేసే కామెంట్ల‌నే కాదు.. వారు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విష‌యాల‌ను కూడా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తుంటారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా ప్ర‌భంజ‌నం పెరిగిపోయిన త‌ర్వాత‌.. ఈ ప‌రిశీలన మ‌రింత నిశితంగా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే కీల‌క నాయ‌కులు.. చేసే ప‌నులు.. వారు ధ‌రించే దుస్తులు.. వారివ్య‌వ‌హార శైలి వంటివి కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందు.. ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌లుర‌కాల దుస్తులు ధ‌రించేవారు. రంగు రంగుల ష‌ర్టులు వేసేవారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒకే డ్ర‌స్ కోడ్ పాటిస్తున్నారు. కేవ‌లం తెలుగు చొక్కా.. బిస్క‌ట్ క‌ల‌ర్ రంగుల‌నే ఆయ‌న వాడుతున్నారు. దీనిపై అప్ప‌ట్లో చాలా రోజులు చ‌ర్చ జ‌రిగింది. చివ‌ర‌కు తేలిందేంటంటే.. విశాఖ స్వామి చెప్పిన సూచ‌న‌లు.. స‌ల‌హాల కార‌ణంగానే ఆయ‌న ఇలా డ్ర‌స్ కోడ్ మార్చుకున్నార‌ని తెలిసింది.

ఇక‌, ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేతికి ఉంగ‌రం ధ‌రించ‌డం కూడా ఆస‌క్తిగా మారింది. రెండు మూడు రోజుల పాటు.. సోష‌ల్ మీడియాను ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై ఏకంగా చంద్ర‌బాబే స్పందించి.. స‌మాధానం చెప్పుకొచ్చారు. అది ఉంగ‌రం కాద‌ని ఫిట్‌నెస్ ట్రాక‌ర్ అని బాబు తెలిపారు. అందులో చిప్ ఉంటుంద‌ని, త‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యుల‌కు చేర‌వేస్తుంద‌ని వెల్ల‌డించారు. దీంతో ఆ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింది. ఇది ఇలా స‌ద్దు మ‌ణిగిందో లేదో.. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతి ఉంగరం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేతికి కొత్త‌గా మ‌రో ఉంగ‌రం చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న కుడిచేయి ఉంగ‌రం వేలుకు ఎరుపురంగు రాయి ఉన్న ఉంగ‌రాన్ని ధ‌రించేవారు. కానీ తాజాగా ఆకుప‌చ్చ రంగు ఉన్న ఉంగ‌రం ద‌ర్శ‌న‌మిచ్చింది. దీనిపై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం కేసీఆర్‌.. రాజ‌కీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ఒత్తిళ్లు త‌ట్టుకునేందుకే ఆయ‌న ఇలా ధ‌రించి ఉంటార‌ని విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఎందుకంటే స‌హ‌జంగానే కేసీఆర్ ఆధ్యాత్మిక వాది. రాష్ట్రం కోసం.. కుటుంబం కోసం.. ఆయ‌న అనేక యాగాలు చేశారు.

ఇక‌, యాదాద్రిని పున‌ర్నించారు. ఈ నేప‌థ్యంలో ఆధ్యాత్మికంగానే ఆయ‌న ఈ ఉంగరం ధ‌రించార‌ని.. అధికారం నిలుపుకోవ‌డం కోస‌మే.. ఆయ‌న రింగు దారిలో న‌డుస్తున్నార‌ని వ్యాఖ్యానాలు వ‌చ్చాయి. కేసీఆర్ త‌న కుడిచేతి ఉంగ‌రం వేలుకు ఎప్పుడూ ఒక ఉంగ‌రాన్ని ధ‌రించి క‌న‌ప‌డుతుంటారు. ఇప్పుడు ఆకుప‌చ్చ రంగు ఉంగ‌రం ఉండ‌టంతో దానివ‌ల్ల ఎటువంటి మేలు జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు. సాధార‌ణంగా మ‌న జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ఎరుపు రంగును ఆరోగ్యం కోసం ధ‌రిస్తారు. ఆకుప‌చ్చ రంగును ప‌ద‌వుల్లో ఉన్న‌తి కోసం ధ‌రిస్తారు.

త‌న ప‌ద‌విలో ఉన్న‌త‌స్థానాన్ని కోరుకోవ‌డంవ‌ల్లే కేసీఆర్ ఈ ఉంగరం ధ‌రించారంటూ చ‌ర్చ ప్రారంభ‌మైంది. అంతేకాకుండా ఆయ‌న‌కు కూడా వీటిపై న‌మ్మ‌కాలుండ‌టం, ముహూర్తాలు చూసుకొని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలాంటివి చేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంపై మంచి న‌మ్మ‌కం ఉంది. ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తాపార్టీతో టీఆర్ఎస్‌కు హోరాహోరీగా యుద్ధం న‌డుస్తోంది. రాష్ట్రంలో ఎన్నిక‌లు కూడా ముందుగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తుండ‌టంతో క‌లిసి రావ‌డానికి ఇది ధ‌రించారంటున్నారు. మ‌రి ఆయ‌న దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి.