Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు-ఒడిశా ఫార్ములా.. ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   2 Nov 2022 9:30 AM GMT
చంద్ర‌బాబు-ఒడిశా  ఫార్ములా.. ఏం జ‌రుగుతోంది?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో నాయ‌కులు నిద్ర పోతున్నారా? లేక నిద్ర నటిస్తున్నారా? అనేది పార్టీ అధినేత, 14 ఏళ్ల‌పాటు రాష్ట్రాన్ని పాలించిన మాజీ సీఎం చంద్ర‌బాబుకు సైతం అర్ధం కావ‌డం లేద‌ట‌. ఇప్ప‌టికి ఆయ‌న అనేక రూపాల్లో నాయ‌కుల‌కు హిత‌వు ప‌లికారు. వారిని క‌దిలించే ప్ర‌య త్నం చేశారు. ప్ర‌తి ఒక్క‌రికీ క్లాస్ ఇచ్చారు. ప్ర‌త్యేకంగా మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలో కూడా పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. అయినా ఇవ‌న్నీ ఫలించ‌లేదు. దీంతో చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌ల కొర‌డా ఝ‌ళిపించారు.

ప‌నిచేసే వారికే టికెట్లు ఇస్తామ‌ని చెప్పారు. అంతేకాదు, నిరంత‌రం త‌ను అన్నీ చూస్తున్న‌ట్టు కూడా వెల్ల‌డించారు. దీంతో ఏదో మొక్కుబ‌డి తంతుగానే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు నాయ‌కులు హాజ‌రవుతున్నారు. ఇటీవ‌ల పార్టీ నేత‌ల‌పై నమోద‌వుతున్న సోష‌ల్ మీడియా కేసుల‌కు సంబంధించి చంద్ర‌బాబు తీవ్రంగా మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేసేందుకు టెలీ కాన్ఫ‌రెన్స్ ప్రారంభించారు. ఈ విష‌యాన్ని ముందు రోజే కొంద‌రు నాయ‌కుల‌కు స‌మాచారం కూడా అందించారు. అయితే, వీరిలో స‌గం మంది కూడా ఈ కార్ఫ‌రెన్స్‌కు రాలేదు.

వివిధ కార‌ణాల‌తో త‌ప్పించుకున్నారు. దీనిపైనా చంద్ర‌బాబు కూపీ లాగారు. ఈ క్ర‌మంలో కొందరు కావాల‌నే ఈ కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌ర‌య్యార‌ని, కొంద‌రికి నిజంగానే కార‌ణాలు ఉన్నాయ‌ని తెలిసింది. దీంతో ప‌రిస్థితి ఇలానే ఉంటే పార్టీ పుంజుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించారో ఏమో చంద్ర‌బాబు మ‌ళ్లీ త‌నే న‌డుం బిగించారు.

ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందుగానే ఆయ‌న వివిధ రూపాల్లో కార్య‌క్ర‌మాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న నాలుగు నెల‌ల‌పాటు ప్ర‌జ‌ల్లో ఉండేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తున్నారు.

జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఎలా ఆక‌ర్షించాలి.. ప్ర‌ధాన‌మైన హామీలు ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ముందుకు సాగాలి? అనే విష‌యాల‌పై చంద్ర‌బా బు ఒక రూట్ మ్యాప్ త‌యారు చేసుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. క‌ట్ చేస్తే, చంద్ర‌బాబు ఈ వ‌య‌సులోనూ తిర‌గ‌డంపై పార్టీలోని కొంద‌రు నాయ‌కులు స‌హా రాజ‌కీయ నేత‌లు, టీడీపీ అభిమానులు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు ఇంకా తిర‌గ‌డం స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌లకు ముందు ఒడిశా ప్ర‌భుత్వాధినేత న‌వీన్ ప‌ట్నాయ‌క్ కాలు బ‌య‌ట‌కు పెట్ట‌లేదు.

అంతా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తోనే ఇంట్లో కూర్చుని.. త‌నే అన్నీ అయి, పార్టీని ముందుండి పార్టీని న‌డిపించారు. దీంతో అక్క‌డ అప్ప‌ట్లో అనుస‌రిం చిన మార్గంపై అధ్య‌య‌నం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీనిపై త్వ‌రలోనే మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు నేతృత్వంలో ఒక క‌మిటీని ఏర్పాటు చేసి ఒడిశా పంపించాల‌ని భావిస్తున్నార‌ట‌. అక్క‌డ ఏం చేశారో తెలుసుకుని ఏపీలోనూ అదే మంత్రం ప‌ఠించాల‌ని చూస్తున్నార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.