Begin typing your search above and press return to search.

వడ్డీల లెక్క చూస్తున్న చంద్రబాబు... ?

By:  Tupaki Desk   |   30 Oct 2021 2:30 PM GMT
వడ్డీల లెక్క చూస్తున్న చంద్రబాబు... ?
X
చంద్రబాబు ఈ మధ్య తరచూ ఒక మాట అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అని చెబుతూనే దానితో పాటు పవర్ ఫుల్ డైలాగులు కూడా వదులుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ నేతలు చేసిన తప్పులకు వడ్డీతో సహా చెల్లింపు చేస్తామని అంటున్నారు. మీరు ఎక్కడికీ తప్పించుకోలేరు, మేము అసలు రాజీ పడం, ఎవరు ఏమేమి తప్పులు చేశారు అన్నది మొత్తం చిట్టా మా దగ్గర ఉంది అంటున్నారు. ఇది ఒక రకంగా క్యాడర్ ని ఉత్సాహపరచే వ్యూహం. అదే టైమ్ లో మేము పవర్ లోకి వచ్చేస్తున్నామని చెప్పడం ద్వారా అధికార వైసీపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి కూడా టీడీపీ చూస్తోంది. ఇక అన్నీ గుర్తు పెట్టుకుంటాం, అసలూ వడ్డీలతో సహా చెల్లిస్తామన్న మాట మాత్రం ఒక పెద్ద హెచ్చరికగానే పంపుతున్నారు. ముఖ్యంగా అధికారులకు, పోలీసులకు ఇది ఇచ్చే వార్నింగ్ గానే అనుకోవాలి.

తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మాట్లాడడం వెనక ఆత్మ విశ్వాసం ఉందా అంటే దాని కంటే కూడా డిఫెన్స్ లో వైసీపీని పడేయాలి అన్న ఆలోచనే ఉంది అంటున్నారు. 151 సీట్లతో వైసీపీ 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీకి ఎంత వ్యతిరేకత వచ్చినా యాభై సీట్లు తగ్గినా వంద సీట్లతో మరో మారు అధికారంలోకి రావడం ఖాయమన్న లెక్కలు వారికి ఉన్నాయి. మరి టీడీపీ ధీమా ఏంటో తెలియదు కానీ వచ్చేది మా సర్కారే అంటోంది. వైసీపీ అరాచక పాలనకు జనాలు గుణపాఠం చెబుతారు అంటూ వారి తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ మాట్లాడుతున్నారు. ఆ విధంగా మైండ్ గేమ్ ని టీడీపీ మొదలెట్టిందనే అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఏపీలో టీడీపీ శ్రేణులు బాగా డల్ అయ్యాయి. పోలీసు కేసులతో పాటు ఇతరత్రా ఇబ్బందులు ఉన్నాయి. దాంతో వారు దూకుడు చేయలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు తరచూ వడ్డీల గురించి మాట్లాడుతున్నారు. మనకూ ఒక చాన్స్ వస్తుంది. మన టైమ్ వచ్చినపుడు వైసీపీ నేతల మీద చర్యలు ఉంటాయని అంటున్నారు. అయితే చంద్రబాబు లాంటి అనుభవం కలిగిన నేత నోటి నుంచి ఇలాంటి మాటలు రావడాన్ని ప్రజాస్వామ్య ప్రియులు మాత్రం హర్షించలేకపోతున్నారు. అధికారం అన్నది ప్రజలకు మేలు చేయడానికి కానీ కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవడానికి కాదు అన్నదే మేధావుల మాట.

అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా కూడా తప్పు చేస్తే తప్పే అంటున్నారు. వడ్డీలతో చెల్లిస్తాం, కేసులు పెడతాం, అంకుశం సినిమాలో రామిరెడ్డిని నడి రోడ్డు మీద నడిపించినట్లుగా వైసీపీ నేతలను రోడ్ల మీద న‌డిపిస్తామని చెప్పడం అంటే ఇది అరాచకానికి పరాకాష్ట అవుతుంది తప్ప ప్రజలు కోరుకునేది ఇది కాదు అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు తాము ఏం మేలు చేస్తామని చెప్పి ఓట్లు అడగడం మంచిది అంటున్నారు. వైసీపీ వారు తప్పులు చేస్తే మేమూ అదే చేస్తామని చెప్పడంలో రాజనీతి ఏముందని కూడా అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పదే పదే వడ్డీ డైలాగులే వల్లించడం విశేషం. మరి ఇది హిట్ అవుతుందా, బూమరాంగ్ అవుతుందా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.