Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క ఏడాది... జగన్ కి గుర్తు చేస్తున్న బాబు

By:  Tupaki Desk   |   15 Oct 2022 2:30 PM GMT
ఒకే ఒక్క ఏడాది... జగన్ కి గుర్తు చేస్తున్న బాబు
X
చంద్రబాబు రోజులను రాజకీయ గణితంతో కొలుస్తున్నారు. కాలాన్ని తొందర పెడుతున్నారు. కలసి రాని కాలమా వేగంగా సాగిపోమా అని గీతాలు ఆలపిస్తున్నారు. అవుని నిజమే చంద్రబాబుకు 2019 నుంచి అన్నీ అపజయాలే. 23 సీట్లతో అసెంబ్లీలో కురచ అయిన పార్టీ స్థానిక ఎన్నికల్లోనూ చతికిలపడిపోయింది. ఇక ఏది ముట్టుకున్నా హిట్ అయితే అవడంలేదు. వ్యూహాలు బెడిసికొడుతున్నాయి.

దాంతో చంద్రబాబు ముందుంది మంచికాలం అని ఆశావహంగా ఎదురుచూస్తున్నారు. అందుకే జగన్ జమానాలో ఉన్న 2019 నుంచి 2024 మధ్య కాలాన్ని ఆయన నిషేధిస్తున్నారు. కిందా మీదా పడి మూడున్నరేళ్ళు పైగా గడిపేశాము. ఏపీలో రాక్షస పాలన అంతానికి ఇంకా ఒకే ఒక్క ఏడాది సమయం ఉంది. అది కాస్తా గడచిపోతే ఇక వచ్చేది మన పాలనే అని బాబు జబ్బలు చరుస్తున్నారు.

మంచిదే అది నేతలో ఆ ధీమా ఉండాల్సిందే. కానీ అది ఆయన వరకే పరిమితం అయితే చాలదు కదా. క్యాడర్ మొత్తానికి ఉండాలి కదా. తమ్ముళ్ళు చాలా మంది అయితే పూర్తి రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా అన్న డౌట్లు కూడా కొంతమందిలో ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అందుకే వారు బయటకు రావడం లేదు అంటున్నారు.

ఇక 2023 మొదలైతే ఎన్నికల వేడి మామూలుగా ఉండదు, నిజానికి 2019 లో ఓడిన దగ్గర నుంచే బాబు వేడి రాజేసి పెట్టారు కానీ తమ్ముళ్ళ అడుగులు ఎక్కడా ముందుకు పడలేదు. ఇపుడు ఎన్నికలకు ఒకే ఒక్క ఏడాది వ్యవధి ఉంది అని బాబు చెబుతున్నా కూడా ఎందుకో తమ్ముళ్లకు కనెక్ట్ అవుతోందా అన్నదే అనుమానంగా ఉంది. లేకపోతే ఏపీలో వైసీపీ ఏలుబడిలో ఎన్నో తప్పులు జరిగాయి. కానీ నిలకడగా నిలబడి నిలదీసి దీర్ఘ కాలం పాటు సాగిన టీడీపీ పోరాటం అయితే ఒక్కటీ లేదనే చెప్పాలి.

ఆఖరుకు విజయవాడ నడిబొడ్డున ఎన్టీయార్ వర్శిటీకి పేరు తీసేసినా కూడా తమ్ముళ్ళలో పెద్దగా చలనం కనిపించలేదు. అదే టైం లో ఏపీలో అరెస్టుల పర్వం అలాగే సాగుతోంది. తమ్ముళ్ల అరెస్టులకు ప్రతిగా చంద్రబాబు లోకేష్ అచ్చెన్న అన్నింటికీ లెక్క చెబుదాం, వడ్డీలతో సహా చెల్లిస్తామని ఏవో చెబుతున్నారు తప్ప నిజంగా పోరాటాలకు మాత్రం సిద్ధం కావడంలేదు అనిపిస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయిన వైసీపీకి తగిన విధంగా రిటార్ట్ ఇవ్వాల్సిన టీడీపీ పూర్తిగా వైసీపీ డైరెక్షన్ లోనే సాగుతోంది అని కామెంట్స్ ఉన్నాయి.

ఏది ఏమైనా చంద్రబాబు మాత్రం ఇపుడు రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. ఒక్క ఏడాది ఏదో విధంగా కష్టపడితే జగన్ని మాజీ చేసి ఇంటికి పంపించవచ్చు అని ధీమా పడుతున్నారు. నిజంగా అలా జరుగుతుందా ఏపీలో టీడీపీ గెలిచే చాన్స్ ఉందా. జనాలలో అలాంటి భావన ఉందా. తమ్ముళ్ళు ఫుల్ రీ చార్జి అయ్యారా. ఏమో 2023 లోకి అడుగుపెడితే కానీ వీటికి సరైన జవాబు అయితే రాదు మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.