Begin typing your search above and press return to search.

బీజేపీ బాట‌లో బాబు!

By:  Tupaki Desk   |   7 Sep 2021 3:08 AM GMT
బీజేపీ బాట‌లో బాబు!
X
2014 ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటు ఆ సంబంధాన్ని కొన‌సాగించారు. కానీ రాష్ట్రం ప‌ట్ల కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ప‌క్ష‌పాత వైఖ‌రి అనుస‌రిస్తుంద‌ని ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌ట్లేద‌నే కార‌ణం చూపి మోడీతో బంధాన్ని బాబు తెంచుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేశారు. కానీ జ‌గ‌న్ ధాటి ముందు నిల‌బ‌డ‌లేక దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గట్టుకున్నారు. పైగా ఆ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మోడీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో కూట‌మి ఏర్పాటు చేసేందుకు బాబు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌టి నుంచి బీజేపీకి దూరంగా ఉంటున్న ఆయ‌న.. ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల బాట‌లో సాగుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పండ‌గ‌ల సంద‌ర్భంగా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గుమిగూడ‌వ‌ద్దు బ‌య‌ట ఉత్స‌వాలు చేయ‌కూడ‌దు అని కేంద్ర ప్రభుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఏపీలో వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కారు నిషేధం విధించింది. ఇళ్ల‌లోనే పండ‌గ చేసుకోవాల‌ని సూచించింది. అయితే ఈ నిర్ణ‌యంపై ఏపీ బీజేపీ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న‌లు ముమ్మ‌రం చేసింది. హిందూ పండ‌గ‌ల‌ను జ‌గ‌న్ కావాల‌నే అడ్డుకుంటున్నార‌ని ఇందులో కుట్ర దాగుంద‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ విష‌యంలో రెండు రోజులుగా మౌనంగా ఉన్న టీడీపీ ఎట్ట‌కేల‌కు స్పందించింది. వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై నిషేధం విధించ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న బీజేపీ బాటలోనే సాగాలని బాబు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై సాగుతున్న వివాదాన్ని టీడీపీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. రాజ‌కీయంగానూ ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు అధికార ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూ ముందుకు సాగాల‌ని అనుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు పార్టీ ముఖ్య నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. వినాయ‌క చ‌వితి పూజ‌ల‌కు ప్ర‌భుత్వం ఏ విధంగా ఆంక్ష‌లు పెడుతుంద‌ని ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. ఇక ఈ నెల 2న దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వ‌ర్థంతిని ఘ‌నంగా నిర్వ‌హించిన వైసీపీ నాయ‌కుల తీరును ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన‌ట్లు తెలుస్తోంది. ప‌ట్ణ‌ణాలు ప‌ల్లెలు అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ వ‌ర్థంతి వేడుక‌ల కోసం వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నేత‌లు కార్య‌క‌ర్త‌లు ఒక్క చోట గుంపులుగా చేరి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. దీంతో అప్పుడు లేని క‌రోనా భ‌యం ఇప్పుడు వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు అన‌గానే వ‌చ్చిందా? అని అంశంపై ప్ర‌శ్నించాల‌ని టీడీపీ అనుకుంటున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌కు ఎలాంటి ఆంక్ష‌లు లేన‌పుడు మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎందుకు పెడుతున్నారంటూ నిల‌దీసేందుకు టీడీపీ సిద్ధ‌మ‌వుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అంతే కాకుండా కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌వ‌క‌ర్గాల్లోనూ ఈ నెల 10న వినాయ‌క చ‌వితి పూజ‌ల‌ను నిర్వ‌హించాల‌ని తీర్మానించిన టీడీపీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి స‌వాలు విసిరింద‌ని నిపుణులు చెపుతున్నారు. మొత్తానికి బీజేపీ బాట‌లోనే సాగి ఈ వివాదంతో ప్ర‌యోజ‌నం పొందాల‌నుకుంటున్న బాబు వ్యూహం ఫ‌లిస్తుందా? లేదా ఎప్ప‌టిలాగే వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌కు కౌంట‌ర్ ఎటాక్ ఇస్తారా? అన్న‌ది చూడాలి.