Begin typing your search above and press return to search.

చంద్రబాబు దృష్టికి టీడీపీ ఎంపీ వ్యవహారం!

By:  Tupaki Desk   |   19 Jan 2023 8:21 AM GMT
చంద్రబాబు దృష్టికి టీడీపీ ఎంపీ వ్యవహారం!
X
ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా కేశినేని నాని గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కేశినేని నాని టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఇప్పటికే కేశినాని నాని తేల్చిచెప్పారు. అయితే తన తమ్ముడు కేశినేని శివనాథ్‌ (చిన్ని), మరో ముగ్గురుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వొద్దని వ్యాఖ్యలు చేశారు. వీరికి సీట్లు ఇస్తే తాను సహకరించబోనని తేల్చిచెప్పారు.

ఎన్టీఆర్‌ టీడీపీని ఒక సిద్ధాంతంతో ఏర్పాటు చేశారని కేశినేని నాని వెల్లడించారు. ఉమనైజర్లకు, కాల్‌మనీ లో ఉన్నవాళ్లకు టికెట్లు ఇవ్వవద్దన్నారు. వీరికి సీట్లు ఇస్తే తాను సహకరింబోనని కేశినేని నాని రెండు రోజుల క్రితం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న ఆవేశంతో మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరం కలసి పనిచేస్తామని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. తాను కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నానన్నారు.

కేశినేని నాని కామెంట్లపై స్పందించిన కేశినేని చిన్ని పార్టీ ఎవరికి టికెట్‌ ఇస్తే వారికి సహకరిస్తానని స్పష్టం చేశారు. కేశినేని నానికి టికెట్‌ ఇచ్చినా తాను మద్దతు ఇస్తానని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో కేశినేని నానికి తెర వెనుకుండి పని చేశానని.. ఆయన గెలుపు కోసం కృషి చేశానని గుర్తు చేశారు.

మరోవైపు కేశినేని నాని వ్యవహారం చంద్రబాబు దృష్టికి చేరినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొన్న కేశినేని నాని మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన దృష్టికి వెళ్లినట్టు సమాచారం. పార్టీలో ప్రక్షాళన జరగాలని.. నిజాయతీగా పనిచేసేవారికే సీట్లు ఇవ్వాలని కేశినేని నాని డిమాండ్‌ చేశారు. అలాగే పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నవారికి కాకుండా ఆస్తులు సంపాదిస్తున్నవారికి సీట్లు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై దృష్టి సారించిన చంద్రబాబు విజయవాడలో కొంతమంది సీనియర్‌ నేతలకు ఫోన్‌ చేసి అసలు అక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా తదితరులు కేశినేని నాని తమను లక్ష్యంగా చేసుకునే విమర్శలు చేస్తున్నట్టు చంద్రబాబు దృష్టికి తెచ్చారని టాక్‌ నడుస్తోంది. కేశినేని నానిపై తాము ఎలాంటి విమర్శలు చేయకపోయినా.. ఆయన పదేపదే తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నట్టు చంద్రబాబు దృష్టికి తెచ్చారని తెలుస్తోంది. తద్వారా పార్టీ పరువును కేశినేని నాని బజారుకీడుస్తున్నట్టు చంద్రబాబుకు వివరించారని సమాచారం.

విజయవాడ లోక్‌ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటిలో కేశినేని నాని గొడవ పడుతున్నారని చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. దీంతో నేతలెవరూ రోడ్లెక్కవద్దని.. సంయమనం పాటించాలని అన్నీ తాను చూసుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.