Begin typing your search above and press return to search.

బాబు స్కానింగ్ : మోడీ షా మనసు తెలిసిపోయిందా...?

By:  Tupaki Desk   |   7 Aug 2022 2:30 AM GMT
బాబు స్కానింగ్ : మోడీ షా మనసు తెలిసిపోయిందా...?
X
శరీరం లోపల ఏముందో చూసేందుకు స్కానింగ్ చేస్తారు. అదే మదిలో ఏముందో తెలుసుకునేందుకు ఏదైనా పరికరం ఉందా అంటే లేదు కానీ కొందరు మేధావులకు మాత్రం అవి తెలుసుకునే వీలుంటుంది. వారు అవతల వారు ఆవలించకపోయినా పేగులు లెక్కెట్టేస్తారు. అలాగే అవతల వారి బాడీ లాంగ్వేజ్ బట్టి వారి తలపులను పట్టేస్తారు.

ఇలాంటి వాటిలో టీడీపీ అధినేత చంద్రబాబు మహా దిట్ట. ఆయనకు ఇపుడు అర్జంటుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా మదిలో ఏముందో తెలియాలి. అందుకే ఆయన ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఈ టూర్ పుణ్యామాని ఒక విధంగా బాబులో ఒక ఆశ తొణికిసలాడుతోంది.

నిజానికి ఇది కేంద్రం ఇచ్చిన పిలుపు. ఇంకా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలకు బొట్టు పెట్టి మరీ పిలిచిన పిలుపు. ఒక విధంగా చూస్తేఅ చంద్రబాబుకు ప్రత్యేకంగా పీట వేసినది అయితే కాదు, కానీ బాబుని కూడా గుర్తుంచుకుని పిలుస్తున్నారు కాబట్టి ఆయనతో పాటు తమ్ముళ్ళు ఈ ఢిల్లీ టూర్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.

అయినను పోవలె హస్తినకు అని శ్రీక్రిష్ణుడు పాండవులతో అంటారు. రాయబారం అన్నది ఎలా ఉన్న అవతల వారి తలపులు ఆలోచనలు పసిగట్టి దానికి తగినట్లుగా వ్యూహాలను రూపొందించుకోవచ్చు అని గీతాకారుడు నాడు గీతోపదేశం చేశాడు. అచ్చం ఆ మాదిరిగానే చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన ఢిల్లీలో అన్నీ గమనిస్తారు. పేరుకు మీటింగ్ వేరేది అయినా ఆయన మోడీతో నాలుగేళ్ళ తరువాత ఫేస్ టూ ఫేస్ అయ్యారు. అలాగే హోం మంత్రి అమిత్ షాతో కూడా.

ఈ సందర్భంగా వారి హావభావాలను బట్టి బాబు ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నది రెడీ అవుతుంది. ఇక బాబు మోడీ షాలతో అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అని అంటున్నారు. బీజేపీకి ఈసారి ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీలు కావాలి. సౌత్ నుంచి ఎక్కువగా వారు ఆశిస్తున్నారు. తెలంగాణాలో ఎన్నో కొన్ని దఖలు పడినా ఏపీలో అయితే జీరో అనే చెప్పాలి.

అదే టీడీపీతో కలిస్తే కనుక కచ్చితంగా అరడజన్ ఎంపీ సీట్లు అయినా బీజేపీ ఖాతాలో పడతాయి. బాబుకు కావాల్సింది బీజేపీతో పొత్తు. కేంద్రం తనకు అండగా ఉందని ఒక ధీమా అయితే జగన్ నుంచి కేంద్ర అండను విడగొడితే ఏపీలో తనకు పూర్తి స్థాయిలో అది కలసి వస్తుంది అన్నది మరో రాజకీయ వ్యూహం. అందుకే బీజేపీని మచ్చిక చేసుకోవడానికి బాబు ఎన్ని ఆఫర్లు అయినా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఎంపీ సీట్లనే సగానికి సగం బీజేపీకి ఇవ్వడానికి కూడా బాబు తయారుగా ఉన్నారని అంటున్నారు. అంటే 13 దాకా అన్నమాట.

మరి అందులో కనీసం ఏ ఆరింటిని అయినా బీజేపీ గెలుచుకున్నా రేపటి ఎన్నికల తరువాత వారికి ఆ నంబర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఏపీలో చూస్తే అమరావతి రాజధాని బాబు అజెండా. దానికి బీజేపీ కూడా ఇపుడు గొంతు కలుపుతోంది. ఒక విధంగా ఏపీ బీజేపీ మెత్తబడింది. ఇవన్నీ కూడా మోడీ, అమిత్ షాల సలహాలు సూచనలు లేకుండా సాధ్యపడవని ఎవరైనా ఊహిస్తారు. అందుకే బాబు ఢిల్లీ టూర్ లో స్కానింగ్ చేయబోతున్నారు. ఏమాత్రం సానుకూలత కనిపించినా మోడీ షాలతో చెట్టపట్టాలే అంటున్నారు.