Begin typing your search above and press return to search.

ఈ ఫోటో చెప్పేస్తుంది చంద్రబాబు స్టామినా ఏమిటో?

By:  Tupaki Desk   |   20 Oct 2022 6:44 AM GMT
ఈ ఫోటో చెప్పేస్తుంది చంద్రబాబు స్టామినా ఏమిటో?
X
ఒక్క ఫోటో.. చంద్రబాబు వయసు మీదా.. ఆరోగ్యం మీదా ఉన్న సందేహాల్ని ఇట్టే పటాపంచలు చేస్తుంది. 72 ఏళ్ల వయసులో ఇంతటి స్టామినా? అన్న ఆశ్చర్యానికి కలగజేసే సీన్ ఒకటి ఆయన తాజాగా చేసిన పల్నాడు పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మిగిలిన విషయాల్ని పక్కన పెడితే.. ఫిట్ నెస్ విషయంలో చంద్రబాబుకు సాటి వచ్చే వారే లేరని చెబుతారు. దశాబ్దాల తరబడి కఠిన ఆహార నియమాల్నిపాటించే ఆయన.. తినేది చాలా చాలా తక్కువన్న మాట ఆయన సన్నిహితులు చెబుతారు.

బాబు ఫిట్ నెస్ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే.. అదంతా ఆయన సతీమణి భువనేశ్వరికే దక్కుతుంది. తాను నిర్దేశించిన ఆహారాన్ని మినహాయించి మరేమీ తినకూడదన్న నియమాన్ని పక్కాగా అమలయ్యేలా ఆమె చూసుకుంటారని చెబుతారు. ఎన్ని పనులు ఉన్నా.. చంద్రబాబు ఆహారానికి సంబంధించిన అంశాల్ని ఆమెనే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారని చెబుతారు. అంతటి శ్రద్ధ ఆమెకు మాత్రమే సాధ్యమవుతున్న మాట బాబుకు దగ్గరగా ఉండే వారు చెబుతుంటారు. ఇదంతా ఎందుకంటే తాజాగా పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు.

భారీ వర్షాలతో దెబ్బ తిన్న రైతుల్ని ఆయన పరామర్శించారు. వారి పొలాల్ని సందర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు ఒక టాస్క్ లాంటిది వచ్చి పడింది. రోడ్డు పక్కన ఉండే గట్టు.. వాటి మధ్య మధ్యలో కాస్త దూరం ఎక్కువగా ఉంచుతారు. సరిగ్గా ఆయనకు అలాంటిది ఎదురైంది. మామూలుగాఅయితే.. నలబై ఏళ్లకు లోపు ఉన్న వారు ఎవరైనా దాన్ని ఇట్టే దాటేస్తారు. కానీ.. చంద్రబాబు వయసు 72. ఈ కారణంతో.. ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది ఆయనకు చేయిని అందించారు. అందుకు నో అని చెప్పేసిన ఆయన అస్సలు సంకోచించకుండా కుర్రాడి మాదిరి ఒక్క ఉదుటున జంప్ చేశారు.

ఆయన ఫిట్ నెస్ ను చూసిన భద్రతా సిబ్బంది మొదలు టీడీపీ నేతల వరకు అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. వయసు మీద పడి ఉండొచ్చు కానీ.. తన మనసు.. శరీరం అంతా కూడా కుర్రాడిలానే ఉందన్న విషయాన్ని ఆయన తన చేతలతో చెప్పేశారని చెప్పాలి. తాజాగా చంద్రబాబు గెంతిన ఉదంతానికి చెందిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

దీన్ని చూసిన తెలుగు తమ్ముళ్లు తెగ సంతోషానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. తమ ప్రాంతానికి నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన చంద్రబాబును చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరగాల్సిన కార్యక్రమం రాత్రి పదకొండుకు జరగటం చూస్తే.. ఆయనకున్న ఆదరణ ఇప్పటికి చెక్కు చెదర్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ విషయాన్ని పక్కన పెడితే.. దెబ్బ తిన్న పంటల వద్దకు.. రైతుల వద్దకు వెళ్లిన చంద్రబాబు పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంత వయసులోనూ ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న విషయం తెలిసినంతనే వారి వద్దకు వెళ్లటం.. వారిని పరామర్శించే తత్త్వం ఇప్పటి అధినేతల్లోనూ ఉంటే ఎంత బాగుండు? చంద్రబాబు చెప్పినట్లుగా.. ‘బటన్’ నొక్కినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. కష్టంలో ఉన్న వారి ఆవేదన తీరదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.