Begin typing your search above and press return to search.

కొడాలి నాని మీద నందమూరి అస్త్రాన్ని సంధిస్తున్న బాబు?

By:  Tupaki Desk   |   15 Nov 2022 8:32 AM GMT
కొడాలి నాని మీద నందమూరి అస్త్రాన్ని సంధిస్తున్న బాబు?
X
రాజకీయ నాయకులు అన్న తర్వాత పార్టీలు మారటం మామూలే. అయితే.. పార్టీ మారిన తర్వాత తాము పని చేసి వచ్చిన అధినేతను ఇష్టారాజ్యంగా తిట్టాల్సిన అవసరం ఉందా? అంటే.. సమకాలీన రాజకీయాలు అదే విషయాన్ని చెబుతుంటాయి. నిజానికి ఇలాంటి తీరుకు భారీగా బలి అయిన రాజకీయ పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే. ఆయన బ్యాడ్ లక్ ఏమంటే.. ఆయన ఎంతో మందికి టార్గెట్ అవుతారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. గులాబీ బాస్ గా పేరున్న కేసీఆర్ సంగతే చూస్తే.. ఆయనకు ఎలాంటి ఇమేజ్ లేని వేళలో.. ఆయనలోని టాలెంట్ ను గుర్తించి.. టీడీపీకి సంబంధించిన ఎన్నోకార్యక్రమాల్లో ఆయనకు భాగస్వామ్యం ఇవ్వటమే కాదు.. ఆయన్ను నేతగా రాటుదేలటానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు. మరి.. అలాంటి తన ఎక్స్ బాస్ ను పట్టుకొని కేసీఆర్ ఎంత నిర్దాక్షిణ్యంగా మాటలు అంటారో అందరికి తెలిసిందే. చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం ఉండి.. జగన్ పార్టీలో చేరిన కొడాలి నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

చంద్రబాబును ఆయన అన్నన్ని మాటలు మరెవరూ అని ఉండరు. అంతేనా.. మరింత దారుణంగా.. ఒక సీనియర్ నేతను.. అందునా మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిని పట్టుకొని.. వయసు విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన నేతగా కొడాలి సుపరిచితుడు. చంద్రబాబును ఆయన చేత తిట్టించే విషయంలో జగన్ అండ్ కో లెక్కలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడు అలాంటి లెక్కలే వేసుకొని మరీ చంద్రబాబు బదులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న మాట వినిపిస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన కొడాలి నానికి ఈసారి ఎన్నికల్లో భారీ షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతారు. అందుకే.. ఆయన మీద పోటీ చేసేందుకు అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతారు.

2004లో జూనియర్ ఎన్టీఆర్ రికమండేషన్ తో టీడీపీ టికెట్ ను సొంతం చేసుకున్న కొడాలి నాని 2009లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2012లో వైసీపీలో చేరిన ఆయన.. 2014, 2019 ఎన్నికల్లోనూ వరుస విజయాన్ని సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన్ను దెబ్బ తీసేందుకు దేవినేని అవినాష్ ను బరిలోకి దింపినప్పటికీ అనుకున్నది సాధించలేకపోయారు. 2019 ఎన్నికల ఫలితం వెలువడిన నాటి నుంచి చంద్రబాబును మరింతగా టార్గెట్ చేయటం మొదలు పెట్టారు కొడాలి నాని. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ ను సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

దీంతో.. 2024లో జరిగే ఎన్నికల్లో కొడాలి నాని విజయాలకు చెక్ పెట్టేందుకు వీలుగా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న చంద్రబాబు.. అందుకు తగ్గట్లు ప్లాన్ సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కొడాలి నాని మీద నందమూరి హరిక్రిష్ణ కుమార్తె.. ఎన్టీఆర్ కు సోదరి అయ్యే నందమూరి సుహాసిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ ప్రపోజల్ మీద చంద్రబాబు ఆసక్తి చూపలేదని చెబుతున్నారు.

2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కుకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. ఓడిపోవటం తెలిసిందే. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుహాసిని బరిలోకి దింపితే కొడాలి నానికి ఇబ్బంది ఖాయమంటున్నారు. అదే సమయంలో.. కొడాలి నానికి సన్నిహితుడిగా చెప్పే జూనియర్ ఎన్టీఆర్ సైతం తన సోదరి పక్షానే నిలిచే వీలుందంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కొడాలికి షాకివ్వాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు.. ఆయనపై నందమూరి అస్త్రాన్ని సంధించటం ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది. ఇప్పుడే బయట పడటం ఇష్టం లేకనే మౌనంగా ఉన్నారని.. త్వరలో ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం ఖాయమంటున్నారు. మరి.. ఈ అంచనా ఎంతమేర నిజం అవుతుందన్న విషయం కాలమే సరైన సమాధానం ఇస్తుందని చెప్పక తప్పదు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.