Begin typing your search above and press return to search.

గుర్తుకొస్తున్నాయి.. నాటి పాద‌యాత్ర‌ను గుర్తు చేసుకున్న చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   2 Oct 2022 1:19 PM GMT
గుర్తుకొస్తున్నాయి.. నాటి పాద‌యాత్ర‌ను గుర్తు చేసుకున్న చంద్ర‌బాబు
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2012లో చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఆదివారంతో 10 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేతను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. నాటి పాదయాత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు కేక్ కట్ చేశారు. 2012 అక్టోబర్ 2 వ తేదీన ప్రారంభమైన వస్తున్నా మీకోసం పాదయాత్ర 208 రోజుల పాటు సాగింది. గ్రామాలు, ప‌ట్ట‌ణాలు.. న‌గ‌రాల‌ను క‌లుపుతూ.. ప్రారంభించిన ఈ యాత్ర నిర్విరామంగా ముందుకు సాగింది.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 63 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు 2,817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి.. నాటి గుర్తుల‌ను మ‌న‌నం చేసు కున్నారు. అప్ప‌టి పాద‌యాత్ర‌లో తీసిన అపురూప చిత్రాల‌తో కూడిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేశారు. అరుదైన వీడియో ల‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌లో ఉండ‌డం.. ప్ర‌జ‌ల‌తో క‌లిసి తిరగ‌డం.. అపురూప‌మైన అనుభూతిని మిగిల్చింద‌ని చెప్పారు.

ప్ర‌జ‌ల‌లో ఉండ‌డం వ‌ల్లే ఆనాడు అధికారంలోకి రాగ‌లిగామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు, వారిలో భ‌రోసా నింపేందుకు త‌న‌కు వ‌స్తున్నామీకోసం.. యాత్ర ఎంతో క‌లిసి వ‌చ్చింద‌ని తెలిపారు. ఏ నాయ‌కుడు అయినా.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయితేనే.. ఫ‌లితం ఉంటుంద‌ని.. ఈ పాద‌యాత్ర ను స్ఫూర్తిగా తీసుకుని.. నాయ‌కులు ప్ర‌జ‌లతో మ‌మేకం కావాల‌ని సూచించా రు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు ఎన్నో క‌ష్టాల్లో ఉన్నార‌ని.. వారిని ఆదుకునేందుకు.. భ‌రోసా నింపేందుకు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు కూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని సూచించారు. గత అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని.. నాయ‌కులు ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయితే.. ఫ‌లితం అనుకూలంగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.