Begin typing your search above and press return to search.

గుంటూరు ఘటనపై చంద్రబాబు స్పందన ఇదే!

By:  Tupaki Desk   |   2 Jan 2023 5:35 AM GMT
గుంటూరు ఘటనపై చంద్రబాబు స్పందన ఇదే!
X
గుంటూరు వికాస్‌ నగర్‌ లో అన్నగారి జనతా వస్త్రాల పంపిణీ, చంద్రన్న కానుక పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచి వేసిందని చెప్పారు. పేదలకు స్వచ్ఛంద సంస్థ చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆలోచనతో అక్కడకు వెళ్లానని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.

కాగా గుంటూరు తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు టీడీపీ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉయ్యూరు ఫౌండేషన్‌ రూ.20 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఎక్సగ్రేషియా ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఉయ్యూరు ఫౌండేషన్‌ చైర్మన్, ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ ప్రకటించారు.

అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను భరిస్తానని తెలిపారు.

ఇక గుంటూరు ఘనటపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఇస్తామని తెలిపారు.

అదేవిధంగా లక్ష రూపాయల చొప్పున డేగల ప్రభాకర్‌ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

మరోవైపు ఈ ఘటన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ వినాశనమేనని వైసీపీ నేత కొడాలి నాని మండిపడ్డారు. ఇక నుంచి చంద్రబాబు సభలకు పోలీసులు అనుమతి ఇవ్వవద్దని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ కోరారు. అమాయకుల మృతికి కారణమవుతున్న చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్రానికి ఇదేం ఖర్మ అన్నట్టుగా మారాయని మరో మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

కాగా వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్‌ వైఫల్యమేనని ఆరోపించారు. పోలీసులు చంద్రబాబు సభలకు, కార్యక్రమాలకు తగిన భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. అందుకే కందుకూరు ఘటన, ఇప్పుడు గుంటూరు ఘటన చోటు చేసుకున్నాయని నిప్పులు చెరుగుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.