Begin typing your search above and press return to search.

మనం ఎన్నిసార్లు రెఫరెండం పెట్టాం చంద్రబాబు?

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:39 PM GMT
మనం ఎన్నిసార్లు రెఫరెండం పెట్టాం చంద్రబాబు?
X
ఏదైనా చెప్పేదే చేయాలి. చేసేదే చెప్పాలి. రాజకీయాల్లో ఉండాల్సిన ఈ ప్రాథమిక సూత్రాన్ని నేతలు ఎవరూ ఫాలో అయినట్లుగా కనిపించరు. ఏపీ విపక్ష నేత చంద్రబాబును చూస్తే.. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు.. చేతలకు ఏ మాత్రం పోలిక ఉండదు. అధికారంలో దాదాపు పద్నాలుగేళ్ల పాటు ఉన్న బాబు.. విపక్షంలోనే అంతకంటే ఎక్కువరోజులే ఉన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించే ఆయన.. తాజాగా అమరావతి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

మూడు రాజధానులు వద్దని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ తో చేపట్టిన ఆందోళనకు ఏడాది నిండిన సందర్భంగా సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.

తాజాగా చంద్రబాబు సవాలు చూస్తే.. ఎలా అయినా రెఫరెండం పెట్టే అవకాశం లేకపోవటంతో.. ఆ పేరుతో సంచలన సవాలుకు దిగారని చెప్పాలి. బాబు చెప్పినట్లుగా రెఫరెండం మాటనే తీసుకుంటే.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విషయాల మీద ఎన్నిసార్లు రెఫరెండం పెట్టారన్నది ప్రశ్న. తన హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే.. ఏ రోజైనా రిఫరెండం నిర్వహిస్తే.. ఈ రోజు బాబు ఆ మాట అడగటానికి అవకాశం ఉంటుంది.

ఎక్కడిదాకానో ఎందుకు రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలని రెఫరెండం చేపట్టారా? ఏకపక్షంగా తీసుకున్న రాజధాని నిర్మాణంపై రెఫరెండం పెట్టారా? లాంటి ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పి.. ఇప్పుడీ మాట మాట్లాడితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు చేయని పనుల గురించి బాబు మాట్లాడటంలో అర్థం ఏమైనా ఉందంటారా?