Begin typing your search above and press return to search.

జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   29 Oct 2021 2:30 PM GMT
జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X
కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు పవర్ కట్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇలా అధికార పార్టీకి చెందిన నేతలు చేయించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే, విద్యుత్ ఉందని, ప్రత్యామ్నాంగా జనరేటర్ ఏర్పాటు చేశామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, టీడీపీ ఫ్లెక్సీల చించివేతకు ప్రతీకారంగా వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలోనే కుప్పంలో జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు....సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. తన పర్యటనకు ప్రభుత్వం అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.

కుప్పంలోకి రౌడీలు, గూండాలు ప్రవేశించారని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీలోని పరిణామాలపై మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు. వైసీపీది దోపిడీ ప్రభుత్వమని, దానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. వైసీపీ అధర్మ పాలనపై, అరాచకాలపై ధర్మపోరాటం చేస్తున్నానని అన్నారు. కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారారని మండిపడ్డారు.

టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. అక్రమ కేసులకు టీడీపీ నేతలు భయపడరని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, వ్యవసాయం సంక్షోభంలో ఉందని అన్నారు. ఏపీలో ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత దుర్మార్గమని చంద్రబాబు దుయ్యబట్టారు. పాఠశాలల ఆస్తులను కాజేసేందుకే జగన్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థుల భవిష్యత్‌తో జగన్ చెలగాటం ఆడుతున్నారన్నాని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ప్రజావ్యతిరేకత మొదలైందని చంద్రబాబు అన్నారు. తాము పులివెందులకు నీళ్లిస్తే..కుప్పానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు నీరు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు ...జగన్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్లు చేశారు. కుప్పం ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా వెనుకడుగు వేయనని, ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందని అన్నారు.