Begin typing your search above and press return to search.

వినాయక చవితి మండపాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   6 Sept 2021 6:00 PM IST
వినాయక చవితి మండపాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం
X
ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వినాయక చవితి పూజలకు అనుమతించారని, ఏపీలో అభ్యంతరం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం వైఎస్ వర్థంతికి నివాళులు అర్పించిన వైసీపీ నేతలకు వర్తించని కోవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయని నిలదీశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ...ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీన వినాయక చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

కమీషన్లకు కక్కుర్తి పడి బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం, దాంతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరవడం వంటి పనులు చేస్తున్నారని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. దశలవారీ మద్యపాన నిషేధం అంటూ ప్రజలను జగన్ మోసం చేశారని, ధరల పెంపుతో పాటు నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం వ్యాపారంలో ఇప్పటికే రూ.25 వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రెండేళ్లలో ఎక్కడా ఒక్క రోడ్డు వేయలేదని చంద్రబాబు ఆరోపించారు. రోడ్డు సెస్ రూ.1200 కోట్లు ఏమయ్యాయని నిలదీశారు.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా జగన్ రెడ్డి అండ్ కో లూఠీ కోసమే అప్పులు చేసి టీడీపీపై వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమం కోసం, కరోనా కోసం అప్పులు చేయడం లేదని, కరోనాతో జీవితాలు అతలాకుతలైనా కూడా పన్నుల పెంపు ద్వారా రూ.75 వేల కోట్లు భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు.

రూ.2 లక్షల కోట్లు అప్పు తెచ్చారని, ఈ నిధులు లూటీ కాబట్టే అభివృద్ధి లేదని, సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. చింతమనేని ప్రభాకర్, దియ్యా రామకృష్ణ తదితర నేతల అక్రమ అరెస్ట్ లపై న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా ప్రజలను భ్రమింపజేశారని, ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని అన్నారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు ఈ నెల 9వ తేదీన నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.