Begin typing your search above and press return to search.

పెద్ద మాటతో షాక్ : టీడీపీలో సీనియర్లు సైలెంట్ ...?

By:  Tupaki Desk   |   13 May 2022 12:32 PM GMT
పెద్ద మాటతో షాక్  : టీడీపీలో సీనియర్లు సైలెంట్ ...?
X
తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కొందరు ఇపుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు మామూలుగా పార్టీ నాయకుల విషయాలలో చాలా ఉదారంగా ఉంటారు. మొహమాటాలు కూడా ఎక్కువగా ఆయన్ని కట్టిపడేస్తూంటాయి. కాబట్టి 2019 ఎన్నికల దాకా షష్టి పూర్తి బ్యాచ్ లే పోటీలో ఎక్కువగా కనిపించాయి. కాదూ కూడదు అనుకుంటే వారి వారసులకు టికెట్లు ఇస్తూ బుజ్జగిస్తూ బాబు పార్టీని బాబు నడిపారు.

దాని ఫలితాలు కూడా 2019లో అలాగే వచ్చాయి. ఒకనాడు కాంగ్రెస్ తో పోటీ కాబట్టి ఏం చేసినా కుదిరేది. ఇపుడు సీన్ అలా కాదు, వైసీపీ మరో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. దాంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా సీన్ ఉంటోంది. ఇక వైసీపీలో చూస్తే ఎక్కువమంది కొత్తవారు, యువకులు కనిపిస్తున్నారు. అది 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి బాగా కలసివచ్చింది. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ కూడా తన రూట్ మార్చుకోవాలని చూస్తోంది.

అందుకే చంద్రబాబు గతం గతహా అంటున్నారు. ఈసారి యువతకే టిక్కెట్లు అని క్లారిటీ ఇచ్చేశారు. వారితోనే కొత్త రక్తం పార్టీకి ఎక్కించబోతున్నాను అని చెప్పేసారు. ఈ పరిణామాల నేపధ్యంలో చాలా మంది సీనియర్లకు షాకులు తగలబోతున్నాయని అంటున్నారు. రాయలసీమ జిల్లాలో చూస్తే అనంతపురానికి చెందిన మాజీ మంత్రి నిమ్మల క్రిష్ణప్ప ఈ మధ్యన హైకమాండ్ ని కలిస్తే టికెట్ విషయంలో హామీ దక్కకపోగా త్యాగాలు చేయాల‌ని పెదబాబు, చినబాబు చెప్పారని టాక్ నడుస్తోంది. ఈసారి అసెంబ్లీకి పోటీ చేయడానికి క్రిష్ణప్ప అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు పార్టీ నుంచి సరైన భరోసా లభించలేదు అంటున్నారు.

ఆయనే కాదు, మరో మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన పల్లె రఘునాధరెడ్డికి కూడా టికెట్ కష్టమే అంటున్నారు. ఆయన ఈసారి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. గెలిస్తే మంత్రి కావాలని కూడా ఆయన ఆశిస్తున్నారు. కానీ ఆయనకు టికెట్ దక్కడం కష్టమే అని తేలుతున్న వాస్తవం. అలాగే జేసీ బ్రదర్స్ కి కూడా ఈసారి ఝలక్ ఇవ్వాలని హై కమాండ్ డిసైడ్ అయిందట. వారి వారసులకు కూడా గెలుపు అవకాశాలు ఉంటేనే టికెట్ అంటున్నారు.

కర్నూల్ జిల్లాలో చూస్తే మాజీ మంత్రి అఖిల ప్రియకు టికెట్ దక్కదు అని చెబుతున్నారు. ఇదే జిల్లా నుంచి కేఈ క్రిష్ణ మూర్తి ఫ్యామిలీ నుంచి కూడా సీనియర్లకు చెక్ చెబుతున్నారు. అలాగే కోట్ల కుటుంబం నుంచి సూర్యప్రకాశ్ రెడ్డికి ఈసారి రిటైర్మెంటే అంటున్నారు. ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వవచ్చు ఆమె కాదంటే కుమారుడికి ఇస్తారు అని చెబుతున్నారు.

అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా పలువురు సీనియర్లు గెలవరు అని డౌట్ ఉన్న వారికి టికెట్లు దక్కవని చెబుతున్నారు. వీరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కూడా ఉన్నారని తెలుస్తోంది. అలాగే పార్టీ జెండా మోయకుండా ఎన్నికల వేళకు మాత్రం టికెట్ అడిగే వారికి నో చెప్పాలని చూస్తున్నారు. కడపలో అయితే ఇతర పార్టీల నుంచి సీనియర్లు వస్తామని చెప్పినా టికెట్ ఇవ్వమని హై కమాండ్ చెప్పేస్తోందిట. ఆ విధంగా మైదుకూరు నుంచి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సైకిలెక్కుతాను అంటే టికెట్ విషయంలో ఎలాంటి హామీ దక్కలేదుట. ఇవన్నీ చూస్తూంటే ఈసారి సీనియర్లు చాలా మంది ఇంటికే పరిమితం అవుతారు అని అంటున్నారు.