Begin typing your search above and press return to search.

వాడుకొని.. సీటివ్వకుండా బాబ్ షాకిచ్చాడు

By:  Tupaki Desk   |   4 March 2019 5:30 AM GMT
వాడుకొని.. సీటివ్వకుండా బాబ్ షాకిచ్చాడు
X
రాజకీయాల్లో నేతలను అవసరార్థం వాడుకోవడం.. అవసరం తీరాక వదిలించుకోవడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇప్పుడవి అక్షర సత్యం అవుతున్నాయి. తాజాగా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు.

తాజాగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ.. సర్వేల్లో వెనుకబడ్డారంటూ రకరకాల సాకులతో చంద్రబాబు ఈసారి టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేనంటూ తెగేసి చెప్పాడంట. దీంతో ఆ సదురు వైసీపీ ఎమ్మెల్యేలు నిండా మునిగి బాబును నమ్మి లబోదిబోమంటున్నారు.

మొత్తం 23మంది వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.. వారిలో భూమా నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు మృతిచెందగా.. మిగిలిన 21 మంది కేవలం ఐదుగురికి మాత్రమే మళ్లీ పోటీచేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 21 మందిలో నలుగురు మంత్రులుగా కూడా చేశారు. ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి తలకిందులవుతోంది.

నలుగురు మంత్రుల్లో ఇద్దరికీ మళ్లీ సీటు డౌటేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి తనకు జమ్మలమడుగు ఇవ్వాలని కోరినా బాబు పెడచెవిన పెట్టి కడప నుంచి పోటీచేయిస్తున్నాడట.. దీంతో తాను బలిపశువు అయ్యానని ఆది నారాయణ రెడ్డి సన్నిహితుల వద్ద వాపోతున్నాడట..చివరకు తన చేతిలోనే ఓడిపోయిన రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగులో మద్దతివ్వాల్సిన పరిస్థితి చూసి బోరుమంటున్నారట.. ఇక విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే కం మంత్రి సుజయకృష్ణను అవినీతి ఆరోపణల కింద పక్కనపెడుతున్నారట.. పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ, పాడేరు-గిడ్డి ఈశ్వరీ, రంపచోడవరం-వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు-వరుపుల సుబ్బారావు, విజయవాడ పశ్చిమ-జలీల్ ఖాన్, యర్రగొండపాలెం-డేవిడ్ రాజు, శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కొడుమూరు-మణిగాంధీ, కదిరి-చాంద్ భాషా, బద్వేలు-జయరాములు, పామర్రు ఎమ్మెల్యే కల్పనకు మళ్లీ సీట్లు దక్కే అవకాశాలు లేవని టీడీపీ వర్గాల సమాచారం. దీంతో వారంతా వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చి బాబు చేతిలో నిండా మునిగిన ఎమ్మెల్యేలుగా ముద్రపడ్డారు. ఇప్పుడు భోరుమనడం తప్ప వారికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి కూడా సీటు ఖరారు చేయలేదు. దీంతో వీరిందరి రాజకీయ భవితవ్యం పూర్తిగా తలకిందులైంది. ఇలా తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడంలో పని పూర్తయ్యాక వారిని పక్కనపెట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట అని ఈ ఉదంతం చూశాక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సదురు వైసీపీ ఎమ్మెల్యేలను బాబు ప్రలోభపెట్టి ఒక్కొక్కరికి 30 కోట్లకు పైగా డబ్బులిచ్చి.. కొందరికి మంత్రి పదవులిచ్చి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని మణి గాంధీ, గిడ్డి ఈశ్వరీ వంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి వారిలో అత్యధిక మందిని పక్కనపెట్టారు. చంద్రబాబును పూర్తిగా నమ్మి మోసపోయామని.. ఆయన తమను కరివేపాకులా తీసేసాడంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బావురుమంటున్నారు. తమ పరిస్థితి రెండికి చెడ్డ రేవడిలా తయారైందని మథనపడుతున్నారు.