Begin typing your search above and press return to search.

తెలంగాణాలో సైకిల్ తొక్కితే ఏపీలో ఫ్యాన్ పార్టీకి దెబ్బడిపోవాలి......లాజిక్ ఇదే...?

By:  Tupaki Desk   |   12 Dec 2022 2:30 PM GMT
తెలంగాణాలో సైకిల్  తొక్కితే  ఏపీలో ఫ్యాన్ పార్టీకి దెబ్బడిపోవాలి......లాజిక్ ఇదే...?
X
రాజకీయాల్లో లింకులు ఎక్కడ నుంచి ఎక్కడికో ఉంటాయి. వాటిని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి కానీ ఆకాశాన్ని భూమినీ కూడా కలిపేయవచ్చు. అసలే రాజకీయాల్లో తలపండిన వారు చంద్రబాబు. అపర చాణక్యుడు అని ఆయనకు ఇంకో పేరు ఉంది. దాంతో బాబు రాజకీయం అటు నుంచి ఇటు అయినా కావచ్చు. ఎటు అయినా కావచ్చు.

ఆరు నూరు అయినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏపీలో గెలిపించి తీరాలన్నది బాబు లక్ష్యం. దానికి అనుగుణంగా ఆయన పావులు కదుపుతున్నారు. అందుకు ఇపుడు తెలంగాణాను ఆయన వాడుకుంటున్నారు. అదెలా అంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో ఎంతో కొంత ఉనికి ఉంది. దానికి మరికాస్తా ఊపిరి పోసి వచ్చే ఎన్నికల వేళ నాటికి ఎంతో కొంత బలం ఉన్నట్లుగా చూపించుకోగలిగితే ఏపీ రాజకీయ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోతుంది. ఇదీ బాబు ఎత్తుగడ.

అదెలా అంటే ప్రస్తుతానికి తెలంగాణా టీడీపీకి 1.3 శాతం ఓటు బ్యాంక్ ఉంది. దాన్ని మూడింతలు అంటే అయిదు శాతం చేయడానికి బాబు చూస్తున్నారు. అందుకోసమే అన్నట్లుగా ఆయన బీసీ నేత అయిన కాసాని జ్ఞానేశ్వర్ ని ఏరి కోరి మరీ తీసుకువచ్చి మరి తెలంగాణా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చేశారు. రాష్ట్ర స్థాయిలో ఒక మామూలు నాయ‌కుడు అయిన జ్ఞానేశ్వర్ కి ఈ పదవి ఇపుడు విలువైనదిగా ఉంది. పైగా ఎన్నికల వేళ ఆయనకు ఈ కీలక పదవి దక్కడం కూడా ఎంతో ఖుషీని ఇస్తోంది.

దాంతో జ్ఞానేశ్వర్ తన‌దైన సైలిలో తెలుగుదేశం పార్టీని తెలంగాణాలో ఎంతో కొంత బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఆయన నాయకత్వాన తాజాగా టీడీపీ ద్వారా ఈ నెల 21న ఖమ్మంలో పార్టీ భారీ బహిరంగ సభ జరగనుంది. ఆ రోజు జరిగే సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సభ సూపర్ హిట్ చేయడానికి జ్ఞానేశ్వర్ గట్టిగా శ్రమిస్తున్నారు.

ఎటూ ఖమ్మంలో టీడీపీకి కొంత పట్టు ఉంది. ఇపుడు సభ హిట్ అయితే ఆ స్పీడ్ లో తెలంగాణాలో మరిన్ని సభలు పెట్టడానికి డిసైడ్ అవుతున్నారు. అలా తెలంగాణాలో టీడీపీ ఓటు షేర్ ని అయిదు శాతం పెంచినా కూడా అది రాజకీయంగా తెలుగుదేశానికి లాభిస్తుంది అని అంటున్నారు. బీజేపీకి తెలంగాణా మీద బోలెడు ఆశలు ఉన్నాయి. అయిదు శాతం ఓటు బ్యాంక్ కలిగిన టీడీపీని అది ఎట్టిపరిస్థితుల్లో వదులుకోదు.

దాంతో మంచిగా రాయబేరాలు నడుపుకుంటే ఏపీలో బీజేపీతో పొత్తు కుదురుతుంది అని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. ఏపీలో జగన్ నుంచి బీజేపీని దూరం చేయడమే తమ విజయ రహస్యమని తెలుగుదేశం భావిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ వైసీపీకి తెర వెనక చేసిన సాయం వల్లనే ఆ పార్టీ గెలిచిందని, తాము ఓటమి పాలు అయ్యామని బాబు భావిస్తున్నారు. దానికి తోడు టీయారెస్ మద్దతు కూడా లభించింది అని టీడీపీ ఆలోచిస్తోంది.

ఇపుడు ఇవేమీ దక్కకుండా చేస్తే కచ్చితంగా వైసీపీని జగన్ని ఓడించడం తేలిక అవుతుంది అని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు అని చెబుతున్నారు. దాని వల్లనే ఇపుడు తెలంగాణాలో టీడీపీకి కొత్త ఊపిరులు ఊదుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి తెలంగాణా తమ్ముళ్ళకు ఇపుడు అర్ధం కావాల్సింది ఏమిటీ అంటే అక్కడ ఎంత బాగా సైకిలి తొక్కితే ఏపీలో ఫ్యాన్ పార్టీ అంతే తీరుగా దెబ్బ తింటుందని. అందుకే బాబు డైరెక్షన్ లో ఇపుడు తెలంగాణా సైకిల్ దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది అన్న మాట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.