Begin typing your search above and press return to search.

బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా బాబూ?

By:  Tupaki Desk   |   27 Jan 2019 9:06 AM GMT
బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా బాబూ?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అత్య‌ధికులు బీసీలు. వారి అండ లేకుండా ఏ పార్టీ కూడా మ‌నుగ‌డ సాగించ‌లేదు! అధికారంలోకి రాలేదు!! అందుకే వారిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటాయి. ఉన్నంత‌లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (రాజ‌మండ్రి)లో టీడీపీ ఈ రోజు నిర్వ‌హించ‌నున్న జ‌య‌హో బీసీ బ‌హిరంగ స‌భ కూడా అందులో భాగ‌మే. ఈ స‌భ‌కు దాదాపు మూడు ల‌క్ష‌ల‌మంది బీసీలు హాజ‌ర‌వుతార‌ని టీడీపీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా స‌భ‌లో పాల్గొన‌నున్నారు.

అయితే - జ‌య‌హో బీసీ స‌భ టీడీపీ చేస్తున్న గిమ్మిక్కు మాత్ర‌మేన‌ని విమ‌ర్శ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇన్నాళ్లూ బీసీల‌ను చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం చేశార‌ని వారు ఆరోపించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టం వ‌ల్లే ఆయ‌న‌కు బీసీ వ‌ర్గంపై అక‌స్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింద‌ని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల‌య్యాక మ‌ళ్లీ ఆయ‌న చేతిలో బీసీలు ద‌గా ప‌డ‌టం ఖాయ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

వాస్త‌వానినికి టీడీపీ ప్ర‌ధాన బ‌లం బీసీలే. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి వారు టీడీపీకి పిల్ల‌ర్ల‌లా నిలిచారు. క‌ష్ట‌కాలంలో అండ‌గా నిల‌బ‌డ్డారు. చంద్ర‌బాబు పార్టీ బాధ్య‌త‌లు స్వీక‌రించాక కూడా బీసీలు టీడీపీతోనే ఉన్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి పీఠం నుంచి దిగిపోయిన త‌ర్వాతి నుంచి మాత్రం ప‌రిస్థితిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపించింది. సీఎం కుర్చీని వీడాక చంద్ర‌బాబు బీసీల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. వారి స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌లేదు.

పోనీ.. చంద్ర‌బాబు తిరిగి సీఎం అయ్యాకైనా బీసీల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశారా అంటే అది కూడా లేదు. రిజ‌ర్వేష‌న్ల కోసం కాపులు పోరాటం ఉద్ధృతం చేయ‌డంతో వారి మ‌న‌సు గెల్చుకునేందుకు ఆయ‌న‌ ప్ర‌య‌త్నించారు. ఎప్పుడూ కాపులు.. కాపులు.. అంటూ వారికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశారు. ఇటీవ‌ల ఈడ‌బ్ల్యూఎస్ కు 10 శాతం కోటాను కేంద్రం నిర్ణ‌యించ‌గా.. ఏపీలో ఆ కోటాలో స‌గాన్ని ఒక్క కాపుల‌కే చంద్ర‌బాబు క‌ట్ట‌బెట్ట‌డం వారిపై ఆయ‌న ప్రేమ‌కు నిద‌ర్శ‌నం. ఈ ప‌రిణామాల‌ నేప‌థ్యంలో బీసీ సామాజిక‌వ‌ర్గం టీడీపీకి దూరమైంది. ఒక‌ప్పుడు రాష్ట్రంలో అత్యంత బ‌లంగా ఉన్న టీడీపీ ఇప్పుడు బ‌ల‌హీనంగా మార‌డానికి వారు దూర‌మ‌వ్వ‌డ‌మే కార‌ణం.

ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు అర్థం చేసుకున్నారు. అందుకే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ తిరిగి బీసీల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఆ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే రాజ‌మండ్రిలో జ‌య‌హో బీసీ స‌భ‌ను పెద్ద‌యెత్తున నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, చంద్ర‌బాబు ఆలోచ‌న బీసీల‌కు ఇప్ప‌టికే అర్థ‌మైంద‌ని.. ఆయ‌న్ను ఆద‌రించి తిరిగి మోస‌పోయేందుకు వారు సిద్ధంగా లేర‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. జయ‌హో బీసీ స‌భ‌లో చంద్ర‌బాబు బీసీల‌పై వ‌రాలు కురిపిస్తే మాత్రం ప‌రిస్థితిలో కాస్త మార్పు రావొచ్చున‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.