Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా సెంటర్ లో బాబు హల్ చల్

By:  Tupaki Desk   |   22 Dec 2022 11:30 AM GMT
ఉత్తరాంధ్రా సెంటర్ లో బాబు హల్ చల్
X
తెలుగుదేశం పార్టీ అధినేత ఉత్తరాంధ్రా వైపు చూస్తున్నారు. పార్టీ పుట్టాక పెట్టాక 2019 ఎన్నికల దాకా చూసుకుంటే ప్రతీ ఎన్నికలోనూ ఉత్తరాంధ్రా టీడీపీ కొమ్ము కాసింది. 2018 మాత్రం వైసీపీ వేవ్ లో ఒక్కసారిగా చతికిలపడిపోయింది. దాంతో 2024 ఎన్నికల్లో తిరిగి సత్తా చాటడానికి బాబు కంకణం కట్టుకున్నారు. దాదాపుగా కొన్ని నెలల తరువాత ఉత్తరాంధ్రా వైపు బాబు చూస్తున్నారు. ఉత్తరాంధ్రా సెంటర్ పాయింట్ అయిన విజయనగరం జిల్లా నుంచే బాబు సమర శంఖం పూరిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో మూడు రోజుల పర్యటనను బాబు పెట్టుకున్నారు. రాజాం, బొబ్బిలి, విజయనగరంలో బాబు పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా రోడ్ షోలతో బాబు టీడీపీ సైకిల్ కి స్పీడ్ పెంచనున్నారు. రాజాం లో రోడ్ షోతో పాటు అక్కడ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. 23న బొబ్బిలిలో బాబు టూర్ ఉంటుంది. అక్కడ ఓబీసీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. ఇదేమి ఖర్మ కార్యక్రమాన్ని కూడా చేపడుతారు.

ఇక చివరి రోజు అయిన 24న చంద్రబాబు విజయనగరం జిల్లాకు వస్తారు. అక్కడ రోడ్ షో ఉంటుంది. అలాగే ఎస్ కోటలో భారీ బహిరంగ సభకు బాబు అటెండ్ అవుతారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ కోసం విశాఖ విమానాశ్రయానికి వచ్చినపుడు ఆయనకు టీడీపీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది.

గతంలో బాబు కోసం వచ్చిన దాని కంటే ఎక్కువగా కార్యకర్తలు రావడం విశేషం. వారికి అభివాదం చేస్తూ బాబు విజయనగరం వెళ్లారు. విజయనగరం జిల్లాలో టీడీపీకి 2019 ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కలేదు. దాంతో ఈసారి మెజారిటీ సీట్లు కొల్లగొట్టాలని బాబు పక్కాగా ప్లాన్ చేశారు.

ఈ టూర్ లో బాబు పార్టీ పరిస్థితిని స్వయంగా గమనించడంతో పాటు పనిచేసే వారు ఎవరు సమర్ధులు ఎవరు అన్నది కూడా గమనించి దానికి తగిన విధంగా పార్టీని నడిపిస్తారు అని అంటున్నారు. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల వర్గ పోరు ఉంది. దాంతో పాటు పార్టీలో నిస్తేజం ఉంది. చాలా మంది సీనియర్ నాయకులు తమ వారసులకు టికెట్లు అంటూ బాబు ముందు డిమాండ్లు పెడుతున్నారు.

అదే సమయంలో సామాజిక సమీకరణలు చూస్తే వేరుగా ఉంటున్నాయి. అలాగే యువతకు కూడా అవకాశాలు ఇవ్వాలని బాబు చూస్తున్నారు. ఇవన్నీ కూడా తాజా టూర్ లో బేరీజు వేసుకుంటారు అని అంటున్నారు. బాబు జిల్లా టూర్ మీద సీనియర్లు కూడా ఇప్పటికే సమీక్ష చేసి సూపర్ హిట్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

చంద్రబాబు రాకతో జిల్లాతో పార్టీ బలం మరింతగా పెరుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో రాజకీయంగా పరిణామాలు మారాయని, గతంలో ఉన్నంత ఆదరణ వైసీపీకి లేదని టీడీపీ నేతలు అంటున్నారు. దాంతో 2024 టార్గెట్ గా ఉత్తరాంధ్రాను మరోసారి ఊపేస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.