Begin typing your search above and press return to search.

ఒట్టు తీసి గట్టు : అసెంబ్లీకి చంద్రబాబు...?

By:  Tupaki Desk   |   10 Sep 2022 3:30 PM GMT
ఒట్టు తీసి గట్టు : అసెంబ్లీకి చంద్రబాబు...?
X
చంద్రబాబు గత ఏడాది వర్షాకాల సమావేశాల సందర్భంగా ఒక భీషణ ప్రతిన చేశారు. తాను మళ్ళీ సీఎం గానే అసెంబ్లీలో అడుగుపెడతాను అని బాబు గారి గంభీరంగా ప్రకటించి అలా శాసన‌సభ నుంచి నాడు నిష్క్రమించారు. అయితే ఈ మధ్యనే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బాబు మళ్ళీ అసెంబ్లీ గడప తొక్కారు. ఆ విధంగా కొంత వ్రత భంగం అయింది. అయితే అన్ని ఒట్లూ తీసి పెట్టడానికే విశాలమైన గట్టు కూడా ఉంది. ఆ గుట్టు రాజకీయ నాయకులకు తెలిసే ఒట్లు పెడుతూ ఉంటారు.

ఇక చంద్రబాబు ఎపుడూ కూడా తన మాట మీద తాను నిలబడిన దాఖలాలు లేవని ప్రత్యర్ధులు విమర్శిస్తూంటారు. అందువల్ల ఆయన ఒట్టు కూడా ఇపుడు గట్టు మీద పెట్టి అసెంబ్లీకి హాజరవుతారు అని అంటున్నారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఈసారి వర్షాకాల సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయం ఏ విధంగా ఉప్పు అందిందో తెలియదు కానీ అమరావతి రైతుల పాదయాత్ర టూ ప్రోగ్రాం రెడీ అయింది. ఈ నెల 12 నుంచి వారు అటు పాదయాత్రకు బయల్దేరతారు.

ఇటు ఈ నెల 15 నుంచి అసెంబ్లీ మొదలుకానుంది. కేవలం అయిందంటే అయిదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలలోనే మూడు రాజధానుల బిల్లి రాబోతోంది. ఆ టైం లో గుంటూరు జిల్లా పొలిమేరలలోనే రైతుల పాదయాత్ర కూడా ఉంటుంది. మరి అమరావతి రాజధాని సృష్టి కర్త అయిన బాబు ఆ వేళకు అసెంబ్లీలో లేకపోతే ఆయన చిత్త శుద్ధి మీదనే అనుమానాలు వస్తాయి. పైగా ఏకైక రాజధాని అమరావతి అని హై కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా వైసీపీ సర్కార్ ధైర్యం చేసి మరీ రాజధానుల బిల్లు పెడుతోంది.

మరి దాన్ని అడ్డుకోవడం నైతికంగా రాజకీయంగా టీడీపీకి ఇపుడు అత్యవసరం. చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి అసెంబ్లీకి రాను అంటే తప్పుడు మేసేజ్ పోతుంది. అంతే కాదు ఆయన్ని నమ్ముకుని వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు కానీ అలాగే పాదయాత్ర చేస్తున్న వారు కూడా ఫైర్ అవడం ఖాయం. దాంతోనే ఇపుడు టీడీపీలో తర్జన భర్జన సాగుతోంది అని అంటున్నారు. ఒక వైపు చూస్తే గవర్నర్ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇక బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిపితే మాత్రం కచ్చితంగా అయిదు రోజుల అసెంబ్లీ మరో రెండు మూడు రోజులకు పెరగవచ్చు. కానీ ఇప్పటికైతే ఇంతే. ఈ సమావేశాలు కేవలం మూడు రాజధానుల కోసమే పెడుతున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏది ఏమైనా ఇంతటి కీలకమైన సమావేశం, ఏపీ దశ దిశ మార్చే రాజధానుల బిల్లు పెడుతున్న సభలో బాబు ఉండాలని ఏకమొత్తంగా విపక్షాలు కూడా కోరుకుంటున్నాయి.

దాంతో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతారు అని అంటున్నారు. మరి ఆయన కనుక సభలో ఉంటే కేవలం అమరావతి రాజధాని విషయమే కాదు గత ఆరు నెలలుగా ఏపీలో జరుగుతున్న విషయాలూ సమస్యలూ అన్నీ కూడా ఏకరవు పెట్టడం ఖాయం. మొత్తానికి దాదాపు ఏడాది కాలం తరువాత బాబు జగన్ అసెంబ్లీ వేదికగా ముఖాముఖాలు చూసుకుంటారా అంటే వెయిట్ అండ్ సీ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.