Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు చంద్రబాబు

By:  Tupaki Desk   |   18 March 2021 8:30 AM GMT
బిగ్ బ్రేకింగ్: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు చంద్రబాబు
X
టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ నోటీసులపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై దాఖలైన సీఐడీ అట్రాసిటీ కేసును సవాల్ చేస్తూ ఆయన ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ తనపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.

గత నెలలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను కేబినెట్ తీర్మానం లేకుండా మార్చిన వ్యవహారంలో నాటి సీఎం చంద్రబాబుపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 24న ఆళ్ల ఫిర్యాదుపై స్పందించిన సీఐడీ 25న చంద్రబాబుతోపాటు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి మరీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 23న విజయవాడలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కాగా చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్లను కూడా విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఈరోజు హాజరై మరిన్ని వివరాలు అందజేశారు.