Begin typing your search above and press return to search.

రీ పోలింగ్ పై చంద్రబాబు ఢిల్లీలో నిరసన!

By:  Tupaki Desk   |   17 May 2019 9:52 AM GMT
రీ పోలింగ్ పై చంద్రబాబు ఢిల్లీలో నిరసన!
X
చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ కు ఈసీ ఆదేశించడంపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు రీ పోలింగ్ ను నిర్వహిస్తూ ఉన్నారంట చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఆరు బూత్ లలో రీ పోలింగ్ ను కోరుతూ వైఎస్సార్సీపీ ఈసీని సంప్రదించగా.. ఐదు బూత్ లలో రీ పోలింగ్ ఈసీ ఒప్పుకుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.

ఆ బూత్ ల పరిధిలో ఎస్సీలు, ఎస్టీలు ఓటు హక్కు వినియోగించుకోలేదని, వారి ఓట్లను కొంతమంది వేశారని, బూత్ క్యాప్చరింగ్ జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయి ఆ బూత్ లలో. దీంతో ఆ నియోజకవర్గం ఫలితాన్నే రీ పోలింగ్ మార్చి వేసే అవకాశాలున్నాయి. అసలే అక్కడ హోరాహోరీ పోరు సాగింది.

ఈ పరిణామాల మధ్యన రీపోలింగ్ పై తెలుగుదేశం పార్టీ అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామంపై శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆందోళనకు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఈ అంశంలో ఫిర్యాదు చేసి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే నిరసన ప్రదర్శనకు దిగుతున్నారని సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి.

అంతేగాక కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సహా మరి కొందరు రాజకీయ పార్టీల అధినేతలను చంద్రబాబు నాయుడు కలవలనున్నారని, వారందరినీ కలిసి ఎన్నికల కమిషన్ తీరుపై చంద్రబాబు నాయుడు నిరసన తెలుపుతారని కూడా తెలుస్తోంది!