Begin typing your search above and press return to search.

ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యలోకి..

By:  Tupaki Desk   |   14 Feb 2020 8:00 AM GMT
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యలోకి..
X
ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై సమావేశాల్లో కూర్చొని, మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం మినహా తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరాటాలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచింది. ప్రభుత్వ పాలన నిర్ణయాలు, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ పటిష్టత తదితర అంశాలను ముడిపెట్టుకుని తెలుగుదేశం పార్టీ తాజాగా యాత్రకు సిద్ధమైంది. ప్రభుత్వ పాలనను తూర్పారాబడుతూనే తమ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు చంద్రబాబు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

అధికారం నుంచి దిగిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు భారీ కార్యాచరణ రూపుదిద్దుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈనెల 19వ తేదీ నుంచి 'ప్రజా చైతన్య యాత్ర'పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు నుంచి ఈ బస్సుయాత్ర మొదలుపెట్టనున్నారు. అన్ని జిల్లాల్లో బస్సుయాత్ర కొనసాగేలా ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. నిరాశలో ఉన్న తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

గతంలో చంద్రబాబు అనేక యాత్రలు చేశారు. సైకిల్ యాత్ర, పాదయాత్ర తదితర చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చేశారు. పదేళ్లు ప్రతిపక్షం లో కూర్చున్న సమయం లో కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీ మళ్లీ అధికారం లోకి వచ్చేలా చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో పాదయాత్ర కాకుండా బస్సుయాత్ర వైపు మొగ్గారు. అయితే ఎన్నికల సమయానికి పాదయాత్ర చేపట్టే అవకాశం కూడా ఉంది.