Begin typing your search above and press return to search.

బాబు మాట;ఐటీ కంపెనీలకు తగ్గకుండా వసతులు

By:  Tupaki Desk   |   4 July 2016 10:27 AM GMT
బాబు మాట;ఐటీ కంపెనీలకు తగ్గకుండా వసతులు
X
ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఉద్యోగుల రాక మొదలైనా.. పూర్తి స్థాయిలో ఉద్యోగులు వచ్చేందుకు ఆగస్టు వరకూ పడుతుందన్న మాటను చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ ఉద్యోగులు తాత్కాలిక సెక్రటేరియట్ లో అడుగు పెట్టే సమయంలో చంద్రబాబు చైనా పర్యటనలో ఉండటంతో ఆయన హాజరు కాలేదు. దీంతో.. సోమవారం సెక్రటేరియట్ ను సందర్శించి.. అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాత్కాలిక సచివాలయం గురించి మహిళా ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పిన ఆయన.. ఈ ప్రాంతం కొంత అసౌకర్యంగా ఉంటుందని.. బురద ఉంటుందని.. ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ పొలాలు కావటంతో భూమి మొత్తగా ఉంటుందన్నారు. రోడ్డు వేసినా.. సింక్ అవుతుందని.. అందుకే.. ముందు మెటల్ రోడ్లు వేయనున్నట్లు వెల్లడించారు.

చిన్న చిన్న సమస్యలు ఎదురువుతుంటాయని.. పెద్ద మనసు చూపించి సర్దుకుపోవాలని ఉద్యోగులను కోరారు. అదే సమయంలో ఐటీ కంపెనీల్లో ఉండేలా సౌకర్యాలకు కొదవ ఉండదన్న భరోసా ఇచ్చారు. ఆగస్టు చివరి నాటికి సెక్రటేరియట్ పూర్తి అయి.. పూర్తి స్థాయిలో ఉద్యోగులు తరలివస్తారన్నారు. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా పని మొదలయ్యాక కొన్ని సమస్యలు వస్తాయని.. అలాంటి వాటిని అధిగమించొచ్చంటూ ధైర్యం చెప్పారు. సంప్రదాయ ప్రభుత్వ ఆఫీసులతో పోలిస్తే తాత్కాలిక సచివాలయం వన్నాఫ్ ది బెస్ట్ గా రూపొందిస్తామన్నారు.

తాత్కాలిక సచివాలయానికి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత స్పష్టత ఇచ్చారు. తాత్కాలిక సచివాలయం పేరిట ఇప్పుడున్న భవనాలన్నీ శాశ్వితమే అయినా.. ఉద్యోగులు పని చేసేది మాత్రం తాత్కాలికం అని.. ఇంతకంటే మంచి భవనాలు నిర్మించి తరలించనున్నట్లు వెల్లడించారు. కేవలం 136 రోజుల రికార్డు సమయంలో భవనాల్ని రూపొందించారని.. భవనాల్ని నిర్మించిన ఎల్ అండ్ టీ.. షాపూర్ జీ పల్లోంజీ సంస్థలు సైతం ఇదో రికార్డుగా తమకు చెబుతున్నట్లుగా చంద్రబాబు చెప్పటం గమనార్హం.