Begin typing your search above and press return to search.

తమ్ముళ్లకు చంద్రబాబు ఒక వార్నింగ్!

By:  Tupaki Desk   |   8 Jun 2022 4:29 AM GMT
తమ్ముళ్లకు చంద్రబాబు ఒక వార్నింగ్!
X
పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే నేతలను, క్యాడర్ ను పట్టించుకోని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు తప్పవని చంద్రబాబునాయుడు తమ్ముళ్ళని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలోని నాలుగు పార్లమెంటు స్థానాల సమన్వయకర్తలతో సమీక్షించారు. 15 రోజుల పాటు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలు క్షేత్ర స్ధాయిలో పర్యటనలు చేయాలని ఆదేశించారు. గ్రూపు రాజకీయాలకు పాల్పడేవారికి, పార్టీకి నష్టం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదన్నారు.

పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జిలు తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపేటపుడు అందరినీ కలుపుకోవాలని చెప్పారు. పార్టీకి నష్టం చేసేవారిని తాను ఉపేక్షించేది లేదన్న విషయాన్ని తమ పర్యటనల్లో నేతలందరికీ అర్ధమయ్యేట్లు చెప్పాలని చంద్రబాబు చెప్పారు. ఇన్చార్జిలకు టికెట్లు ఇవ్వాలన్నా అంతిమంగా వాళ్ళ పనితీరు ఆధారంగానే ఇస్తానని స్పష్టంగా చంద్రబాబు చెప్పారు.

ఏ నియోజకవర్గంలో కూడా తనకు గ్రూపులు కనిపించకూడదన్నారు. గ్రూపు రాజకీయాల వల్ల పార్టీ ఏ స్ధాయిలో నష్టపోయిందో తనకు బాగా తెలుసన్నారు. ప్రజా సమస్యలపైనే నేతలందరూ దృష్టిపెట్టాలని కోరారు.

నియోజకవర్గాల స్ధాయిలోని పార్టీకి సంబంధించిన వివిధ అనుబంధ సంఘాల నియామకాలన్నింటినీ ఇన్చార్జిలు భర్తీ చేయాలని చెప్పారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో నేతలంతా సమిష్టిగా ముందుకు కదలాలని చంద్రబాబు చెప్పారు.

రోడ్డెక్కని నేతలు, పనిచేయని నేతలు, పార్టీకి భారంగా తయారైన నేతల వివరాలను తనకు ఎప్పటికప్పుడు ఇన్చార్జిలు అందించాలన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో తన పర్యటనల్లో జనాల స్పందనను చంద్రబాబు గుర్తుచేశారు. తర్వాత నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో పాల్గొన్న జనాల ఉత్సాహాన్ని గమనించిన తర్వాతైనా నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేక ఆందోళనలు చేయాల్సిందే అన్నారు.

జనాల్లో కనిపిస్తున్న వ్యతిరేకతను నేతలంతా ముందుకు తీసుకెళ్ళాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం మీద మహానాడు తర్వాత నేతల్లో అదే జోష్ ను కంటిన్యు చేయాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకనే నేతలు కూడా తన స్పీడుకు తగ్గట్లుగా పనిచేయాలని చెబుతున్నారు. మరెంతమంది తమ్ముళ్ళు పరుగెడుతారో చూడాలి.