Begin typing your search above and press return to search.

మండలిలో చిచ్చు పెట్టిన చంద్రబాబు 'మనసులో మాట'

By:  Tupaki Desk   |   30 Nov 2020 5:30 PM GMT
మండలిలో చిచ్చు పెట్టిన చంద్రబాబు మనసులో మాట
X
శాసనమండలిలో మొదటిరోజే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద గొడవే అయ్యింది. శాసనమండలిలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో వ్యవసాయం దండగ అంటు చంద్రబాబునాయుడు రాసిన మనసులో మాట అనే పుస్తకంలో ఉందంటు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు ఇపుడు రైతులు, సంక్షేమం అంటు మొసలి కన్నీరు కారుస్తున్నారంటే మండిపోయారు.

బొత్సా మాటలకు టీడీపీ సభ్యులు కౌంటర్లు ఇచ్చారు. దీంతో సభలోనే ఉన్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ లు గట్టిగా అడ్డుకున్నారు. బుగ్గన మాట్లాడుతూ చంద్రబాబు రాసిన పుస్తకాన్ని మార్కట్లో నుండి తెప్పించినా సరే లేదా ఇంట్లో ఉంటే ఓ కాపీని తెప్పిస్తే అందులో వ్యవసాయ రంగంపై చంద్రబాబు ఏమి రాసింది చూపిస్తామంటూ సవాలు విసిరారు. పుస్తకం విడుదలైన తర్వాత వచ్చిన విమర్శలకు భయపడితే ఆ పుస్తకాన్ని మార్కెట్లో నుండి ఉపసంహరించుకున్నట్లు ఎద్దేవా చేశారు. చివరకు టీడీపీ వెబ్ సైట్ నుండి కూడా తీసేసినట్లు చెప్పారు.

తర్వాత ఇదే విషయమై అనీల్ మాట్లాడుతూ చంద్రబాబు రాసిన దిక్కుమాలిన పుస్తకాన్న టీడీపీ వాళ్ళు తెప్పించాలని డిమాండ్ చేశారు. మనసులో మాట అనే దిక్కుమాలిన పుస్తకం చివరకు నెట్ లో కూడా ఎక్కడా దొరకటం లేదన్నారు. ఆ పుస్తకాన్ని ఉంటే తీసుకొస్తే చంద్రబాబు కామెంట్లను చూపిస్తామన్నారు. మొత్తానికి తుపాను కారణంగా జరిగిన పంటల నష్టం, రైతులను ఆదుకోవటం అనే అంశంపై మొదలైన చర్చ చంద్రబాబు ఎప్పుడో రాసిన మనసులో మాట అనే పుస్తకం చుట్టు తిరగటం, రబస జరగటం విచిత్రంగానే ఉంది.