Begin typing your search above and press return to search.

పెద్దలను వదలడు, యూత్ ను మరువడు... ఇదే బాబు సూత్రమట

By:  Tupaki Desk   |   16 Jun 2022 2:30 PM GMT
పెద్దలను వదలడు, యూత్ ను మరువడు... ఇదే బాబు సూత్రమట
X
3 రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఉత్తరాంధ్రకు విచ్చేశారు. పార్టీ ప్ర‌క్షాళ‌న‌కూ, నూత‌నోత్తేజాన్ని తెచ్చేందుకు చంద్ర‌బాబు శ్ర‌మిస్తున్నారు. ఒంగోలులో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన మ‌హానాడు అనూహ్య రీతిలో విజ‌య‌వంతం కావ‌డంతో ఆ స్ఫూర్తిని నింపేందుకు, కొన‌సాగించేందుకు, మ‌ళ్లీ అధికారం అందుకునేందుకు బాబు వెంట‌వెంట‌నే జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు షెడ్యూల్ రాయించారు.

అదేవిధంగా వ‌చ్చే ఏడాది కాలంలో 80కి పైగా నియోజ‌క‌వ‌ర్గాలు ప‌ర్య‌టించ‌నున్నారు. ఇక‌పై ప్ర‌తి నెల‌లో జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయి. నెల‌లో రెండు జిల్లాల ప‌ర్య‌ట‌నలు చేప‌డుతూనే, పార్టీ ప్ర‌గ‌తికి, ప‌టిష్ట‌త‌కూ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ముఖ్యంగా జిల్లాల‌లో నిర్వ‌హించే మినీమ‌హానాడుకు వీలున్నంత వ‌ర‌కూ హాజ‌రు అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక విశాఖ జిల్లా వ‌ర‌కూ మాజీ ఎమ్మెల్యేల‌ను, ఇతర మాజీ నేత‌ల‌ను ఇటుగా ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని కూడా తెలుస్తోంది. గ‌తంలో బాగా ప‌నిచేసి, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారిని తిరిగి పార్టీలోకి ర‌ప్పించేందుకు చూస్తున్నారు.

ఆర్థికంగా స్థోమ‌త ఉన్న‌వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ ఫార్ములా వ‌ర్కౌట్ అవుతుందో లేదో కానీ అధినేత మ‌న‌సులో మాత్రం ఒక‌ప్పుడు పార్టీలో కీల‌కంగా ఉండి ఇప్పుడు ఎటూ వెళ్ల‌లేక స్త‌బ్దుగా ఉండిపోయిన నాయ‌కుల‌ను పిలిపించి మాట్లాడాల‌ని, ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌నల్లో భాగంగానే ఆ ప‌ని పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. ఈ జాబితాలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పంచకర్ల రమేష్, అర్బన్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రెహ్మాన్, నగర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన తయినాల విజయకుమార్ తో స‌హా ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఉన్నారు.

అయితే బాబు పిలుపు మేర‌కు ఇపుడు కలిస్తే హామీ దక్కినా రేప‌టి వేళ సీట్ల మార్పులో భాగంగా టిక్కెట్లు రావేమో అన్న భ‌యం కూడా వీరిలో ఉంద‌ని తెలుస్తోంది. అందుకే బాబు పిలిచాక కూడా కాస్త వెయిట్ అండ్ సీ అన్న ధోర‌ణిలోనే ఉన్నారు. ఎలా అయినా స‌రే ఈ సారి విశాఖ‌లో కీల‌క స్థానాలు కైవ‌సం చేసుకునేందుకు కొంత వ‌ర‌కూ మ‌ధ్యేమార్గంగా గంటా శ్రీ‌నును సైతం రంగంలోకి దింపి సంప్ర‌తింపులు జ‌రిపి అనుకున్న‌ది సాధించాల‌న్న ప‌ట్టుతో ఉన్నారు.

ఎపార్ట్ ఫ్ర‌మ్ దిస్ ..

శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గరం జిల్లాలో నాయ‌క‌త్వాలకు లోటు లేకున్నా పాత ముఖాలు క‌న్నా కొత్త ముఖాలే కొంచెం బెట‌ర్ అన్న వాద‌న వ‌స్తోంది. ఇక్క‌డ కూడా ఆయ‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పెట్టినా కూడా జ‌న‌సేన లాంటి పార్టీలు కొత్త ముఖాల‌కు అవ‌కాశం ఇస్తున్నందున యూత్ ఫాలోయింగ్ ను పెంచుకోవాల‌న్న తాప‌త్ర‌యంలో ఉన్న బాబు మాత్రం విశాఖకు భిన్నంగా శ్రీ‌కాకుళం విష‌య‌మై కొన్ని కొత్త ముఖాల‌కు అయినా ఛాన్స్ ఇస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారు. అయితే విశాఖ‌కు పూర్తి విరుద్ధం అయిన వాతావ‌ర‌ణం మిగ‌తా రెండు ఉత్త‌రాంధ్ర జిల్లాల‌లో ఉంది. అందుకే ఆ రోజు డీవీజీ శంక‌ర్రావు లాంటి యువ‌కులకు విద్యావంతుల‌కు టికెట్ ఇచ్చి పార్వతీపురం నుంచి ఎంపీని చేసిన విధంగానే ఈ సారి కూడా ఏదో ఒక ప్ర‌యోగం చేయాల‌ని భావిస్తున్నారు.