Begin typing your search above and press return to search.

మ‌హారాష్ట్ర‌పై మ‌ళ్లీ బీజేపీ క‌న్ను.. శివ‌సేన‌తో జ‌ట్టుకు సిద్ధం

By:  Tupaki Desk   |   28 July 2020 2:00 PM GMT
మ‌హారాష్ట్ర‌పై మ‌ళ్లీ బీజేపీ క‌న్ను.. శివ‌సేన‌తో జ‌ట్టుకు సిద్ధం
X
అధికారమే ప‌ర‌మావ‌ధిగా బీజేపీ పావులు క‌దుపుతోంది. మెజార్టీ స్థానాల‌తో సంపూర్ణ ప్ర‌భుత్వంలో కూడా చీలిక‌లు తెచ్చి రాజ్యాంగ సంక్షోభం సృష్టించి మ‌రీ ఇత‌ర పార్టీల నుంచి ప్ర‌భుత్వాన్ని లాక్కుని ప‌బ్బం గ‌డుపుకుంటోంది బీజేపీ. గ‌తంలో చాలా రాష్ట్రాల్లో అధికార మార్పిడి చేసిన బీజేపీ ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నాలు చేసేలా ప‌రిస్థితులు ఉన్నాయి. మ‌రోసారి మ‌హారాష్ట్ర అధికార పీఠంపై క‌మ‌ల ద‌శం దృష్టి సారించింది. దీనికోసం శివ‌సేన‌తో జ‌ట్టు క‌ట్టేందుకు సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది. దీనికి తాజాగా మ‌హారాష్ట్ర బీజేపీ నాయ‌కుడు చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం. విభేదాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి విడిపోయిన పార్టీలను తిరిగి వెనక్కి రప్పించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగం‍గా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావాలని, దీని కోసం పటిష్టమైన వ్యూహాలను సిద్ధం చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ శాఖకు నడ్డా సూచనలు చేశారని తెలిసింది. ఈక్ర‌మంలోనే త‌మ మాజీ మిత్ర‌ప‌క్షం శివసేనను ఎన్డీయేలోకి వచ్చేలా మంతనాలు చేయాలని సలహాలు ఇచ్చారని తెలిసింది.

అందులో భాగంగా బీజేపీ మ‌హారాష్ట్ర అధ్య‌క్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన అంగీక‌రిస్తే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను తిరిగి ఎన్డీయేలో చేర్చుకునేందుకు త‌మ‌కు ఎలాంటి అభ్యంతరం లేదని స్ప‌ష్టం చేశారు. ఈ ప‌రిణామం మ‌హారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో అధికారం కోసం ఎలాంటి నిర్ణ‌య‌మైనా తీసుకోవ‌డానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అందుకే గ‌తంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ను ఎన్డీయేలోకి కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్ ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న లుక‌లుక‌ల‌పై బీజేపీ దృష్టి సారించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్‌లో చేసిన‌ట్టు బీజేపీ ప్లాన్ వేస్తోంద‌ని స‌మాచారం.