Begin typing your search above and press return to search.

దూసుకెళ్లిన చంద్ర‌యాన్.. స‌క్సెస్ ఫుల్ టేకాఫ్!

By:  Tupaki Desk   |   22 July 2019 10:17 AM GMT
దూసుకెళ్లిన చంద్ర‌యాన్.. స‌క్సెస్ ఫుల్ టేకాఫ్!
X
యావ‌త్ ప్ర‌పంచ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చంద్ర‌యాన్-2 విజ‌య‌వంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చంద్ర‌యాన్-2ను మోసుకెళుతున్న జీఎస్ ఎల్వీ మార్క్ 2ఎం1 వాహ‌న నౌక విజ‌య‌వంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీ‌హ‌రికోట స‌తీష్ ధ‌వ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్ర‌యోగ వేదిక నుంచి ఈ రోజు మ‌ధ్యాహ్నం (సోమ‌వారం) 2.43 గంట‌ల వేళ‌లో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

అంత‌కు ముందు 20 గంట‌ల పాటుగా సాగిన కౌంట్ డౌన్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకొని నింగిలోకి ప‌య‌న‌మైంది. కేవ‌లం నిమిషం మాత్ర‌మే ఉన్న లాంఛ్ విండోను గ‌త అనుభ‌వంతో శాస్త్ర‌వేత్త‌లు స‌మ‌ర్థంగా.. అత్యంత క‌చ్ఛిత‌త్వంతో వినియోగించ‌టంలో స‌క్సెస్ అయ్యారు. ప్ర‌యోగ వేదిక నుంచి బ‌య‌లుదేరిన రాకెట్ 16.13 నిమిషాలు ప్ర‌యాణించి చంద్ర‌యాన్-2 నిర్ణీత కక్ష్య‌లోకి ప్ర‌వేశ పెడుతుంది.

బాహుబ‌లిగా పేర్కొనే జీఎస్ ఎల్వీ మార్క్ 3ఎం1 రాకెట్ బ‌రువు 640 ట‌న్నులు. 3887 కిలోల బ‌రువున్న చంద్ర‌యాన్-2 కంపోజిట్ మాడ్యుల్ తో ఈ రాకెట్ ప‌య‌నిస్తుంది. ఈ నెల 15న జ‌ర‌గాల్సిన ఈ ప్ర‌యోగం కౌంట్ డౌన్ పూర్తి కావాల్సిన 56 నిమిషాల ముందు సాంకేతిక లోపం త‌లెత్త‌టంతో నాడు ప్ర‌యోగాన్ని నిలిపివేశారు. ఆ లోపాన్ని స‌రి చేసి.. కేవ‌లం వారం వ్య‌వ‌ధిలోనే ప్ర‌యోగానికి సిద్ధం చేశారు.

ప్ర‌యోగం అనంత‌రం 16.31 నిమిషాల ప్ర‌యాణం త‌ర్వాత భూమికి 181 కిలోమీట‌ర్ల ఎత్తుకు చేరిన త‌ర్వాత చంద్ర‌యాన్-2 మాడ్యుల్ ను రోద‌సిలోకి వ‌దిలిపెడుతుంది. ఇలా భూమికి 170.06కి.మీ. ద‌గ్గ‌ర‌గా 39.120 కి.మీ. దూరంలో ఉండే దీర్ఘ వృత్తాకార‌పు భూక‌క్ష్య‌లోకి చంద్ర‌యాన్ మాడ్యూల్ చేరుకున్న వెంట‌నే క‌ర్ణాట‌క బైలాలులోని ఉప‌గ్ర‌హ నియంత్ర‌ణ కేంద్రం దానిని త‌న అధీనంలోకి తీసుకోనుంది. చంద్ర‌యాన్-2 మాడ్యూల్ కు 48 రోజులు ప‌ట్ట‌నుంది.

అనుకున్న‌ట్లుగా ప్ర‌యోగం సాగితే ఈ రోజు నుంచి 23వ రోజున చంద్ర‌బ‌దిలీ క‌క్ష్య‌లోకి వెళుతుంది. త‌ర్వాత ఆర్బిట‌ర్ సంచ‌రించే క‌క్ష్య‌ను చంద్రునికి 100 కిలోమీట‌ర్ల ఎత్తులో వృత్తాకారంగా ఉండేలా చేస్తారు. సెప్టెంబ‌రు 7న చంద్రుడి ద‌క్షిణ ధ్రువంపై దిగేందుకు ఆర్బిట‌ర్ నుంచి విక్ర‌మ్ ల్యాండ‌ర్ విడిపోతుంది. తాను దిగిన ప్ర‌దేశానికి 500 మీట‌ర్ల ప‌రిధిలో 14 రోజుల పాటు సంచ‌రిస్తూ ప్ర‌గ్యాన్ రోవ‌ర్ చంద్రునిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌నుంది.