Begin typing your search above and press return to search.

మహా ఉత్కంటగా మారిన చంద్రయాన్ -2 ఫలితం?

By:  Tupaki Desk   |   7 Sep 2019 5:45 AM GMT
మహా ఉత్కంటగా మారిన చంద్రయాన్ -2 ఫలితం?
X
యావత్ దేశంతో పాటు.. ప్రపంచ దేశాలన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగంలోని కీలకదశకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చంద్రయాన్ 2 ప్రయోగంలో ఇప్పటివరకూ పలు దశల్ని విజయవంతంగా పూర్తిచేసినప్పటికీ.. ప్రయోగం మొత్తంలో కీలక దశ అయిన.. చంద్రుడి మీద ల్యాండింగ్ ఏమైంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

చంద్రుడి అత్యంత సమీప కక్ష్యలోకి సక్సెస్ పుల్ గా చేరిన ల్యాండర్.. అనుకున్నట్లు చంద్రుడి ఉపరితలం మీద దిగిందా? లేదా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకిలా అంటే.. చంద్రుడి మీదకు దిగే కీలకమైన 15 నిమిషాల సమయాన్ని పావుగంటను ‘15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’ అని ఇస్రో చీఫ్ కె.శివన్ చెప్పినప్పుడు చాలామంది పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. అదెంత కీలకమన్న విషయం ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి. ఇంతకీ చంద్రయాన్ -2 ఫలితం ఏమైంది? అన్న విషయంలోకి వెళితే.. చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి అత్యంత సమీపంలోకి వెళ్లే సమయంలో ఒక్కసారిగా సిగ్నల్ అందటం ఆగిపోవటంతో.. ల్యాండింగ్ జరిగిందా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

భారీ హాలీవుడ్ సినిమాలో పదో వంతు ఖర్చుతో నిర్మించిన చంద్రయాన్ -2 ప్రయోగంలో తుది దశను చూసేందుకు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వచ్చారు. అయితే.. చివరి పదిహేను నిమిషాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రధాని కాసేపటికి పక్కకు వెళ్లిపోయారు. దీంతో.. అనుకోనిది ఏదో జరిగిందన్న విషయం టీవీలు చూస్తున్న వారికి అర్థమైంది. ఇంతకీ అసలేం జరిగిందన్నది చూస్తే..

చంద్రయాన్ -2 ప్రయోగంలో భాగంగా 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన విక్రమ్ ల్యాండర్ శుక్రవారం అర్థరాత్రి 2.20 గంటల సమయంలో సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతున్న సమయంలో సంకేతాలు రావటం ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో.. ఏం జరిగిందన్నది ఇప్పుడు అర్థం కాక శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ నుంచి పర్యవేక్షించటంతో పాటు.. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ను కళ్లారా చూసేందుకు ప్రధాని మోడీ మొదలు పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థులతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఎంతో ఉత్సాహంగా చూసిన ల్యాండింగ్ ఏం జరిగిందన్నది తేలకపోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ల్యాండింగ్ జరుగుతుందన్న సమయానికి గంటల ముందు నుంచే భారీ ఉత్కంట చోటు చేసుకుంది. చంద్రుడికి 35 కిలోమీటర్ల దగ్గరగా.. 101 కిలోమీటర్ల దూరంగా ఉండే కక్ష్యలో సంచరిస్తున్న ల్యాండర్ విక్రమ్ సరిగ్గా దక్షిణ ధ్రువంపై భాగానికి చేరుకుంది. ఆ సమయంలో మరింత ఎగువన 96 కిలోమీటర్ల దగ్గరగా.. 125 కిలోమీటర్ల దూరంగా చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ సైతం దక్షిణ ధ్రువం వద్దకు చేరుకుంది.

ఈ సమయంలోనే చంద్రుడి మీద సూర్యోదయం మొదలైంది. ఆ వెలుగులో ఆర్బిటర్ హైరిజల్యూషన్ కెమేరాల సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువానని పరిశీలించారు శాస్త్రవేత్తలు. ఎగుడు దిగుళ్లులేని సమతల ప్రాంతాన్ని ఎంపిక చేసి.. ల్యాండర్ విక్రమ్ ను దాని మీదకు దించే కసరత్తు షురూ చేశారు.

ల్యాండర్ లోని లిక్విడ్ థ్రస్టర్ ఇంజన్లను మండించటం స్టార్ట్ చేసిన తర్వాత ల్యాండర్ విక్రమ్ వేగాన్ని కంట్రోల్ చేయటం షురూ చేశారు. చివరి పదిహేను నిమిషాల్లో దాదాపు 11 నిమిషాల వరకూ ల్యాండర్ విక్రమ్ ఏం చేస్తున్నది.. అసలేం జరుగుతుందన్న అంశానికి సంబంధించిన కంట్రోల్ మన పరిధిలోనే ఉంది.

చంద్రుడి మీద ల్యాండ్ కావటానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ అనుకున్న ప్రకారం వెళ్లిన ల్యాండర్ విక్రమ్.. ఆ తర్వాత నుంచి ఏమైందన్నది అర్థం కాని రీతిలో దాని నుంచి అందాల్సిన సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో.. ఏం జరిగిందో అర్థం కాని ఇస్రో శాస్త్రవేత్తలు ఆందోళనకు గురయ్యారు. ఇస్ర్ో చీఫ్ తీవ్రమైన టెన్షన్ తో ఆందోళనతో అటుఇటు తిరగటం మొదలెట్టారు. అనంతరం.. అసలేం జరిగిందన్న విషయాన్ని ప్రకటించటంతో.. తుది ఫలితం అటూ ఇటూ కాకుండా ఉండిపోవటంతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయారు.

కొన్నిసార్లు కష్టపడినా ఫలితం దక్కదు. తాజా చంద్రయాన్ -2లో ఫలితం దక్కిందా? లేదా? అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రుడిపైన ల్యాండ్ కావటానికి మరో ఐదు నిమిషాల వ్యవధిలో ఉన్న వేళ.. సిగ్నల్స్ కు కట్ అయిపోవటంతో.. చంద్రయాన్ 2 తుది ఫలితం ఏమిటన్నది తేలకుండా ఉండిపోయింది.

చంద్రయాన్ 2 ప్రయోగంలో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్రయోగం తుది ఫలితాన్ని తేల్చే చివరి 15 నిమిసాల్ని గ్రౌండ్ నుంచి ఎవరూ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా.. తనకు తానుగా పని పూర్తి చేసేలా తయారు చేశారు. వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో సక్సెస్ రేటు కేవలం 50 శాతమే ఉంటుంది. అయినప్పటికీ ఆ రిస్క్ కు రెఢీ అయ్యింది ఇస్రో.

చంద్రుడి మీదకు ల్యాండ్ అయ్యే చివరి 15 నిమిషాలు మాత్రమే ల్యాండర్ విక్రమ్ ఏ సంకేతాల్ని అందుకోకుండా తనకు తానుగా పని చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరూ నియంత్రించాల్సిన అవసరం లేకుండా చేశారు. ల్యాండర్ విక్రమ్ ఒకసారి చంద్రుడి మీదకు దిగినంతనే మళ్లీ కంట్రోల్ మన చేతికి వస్తుంది.

సరిగ్గా.. ఈ సమయంలోనే సంకేతాలు ఆగిపోయాయి. ఈ కారణంతోనే చివరి 15 నిమిషాల ఘట్టాన్ని 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని వ్యవహరించారు. తొలుత ఈ విషయాన్ని ఇస్రో చీఫ్.. కొద్దిమంది ముఖ్య శాస్త్రవేత్తలు తప్పించి.. మిగిలిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఆ మాటలు ఎంత కీలకమన్నది ప్రాక్టికల్ లోకి వచ్చాక కానీ అర్థం కాని పరిస్థితి. మరి తుది ఫలితం ఏమైందన్న దానిపై ఇస్రో చేసే ప్రకటన కీలకం కానుంది.