Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానికి తెలంగాణ మందిరాల ఆశీస్సులు

By:  Tupaki Desk   |   16 Oct 2015 10:07 AM GMT
ఏపీ రాజధానికి తెలంగాణ మందిరాల ఆశీస్సులు
X
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని చేయాలని చంద్రబాబు ఎంతగానో తపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు ఆయన అన్ని మార్గాలనూ అనుసరిస్తున్నారు... అధునాతనంగా నిర్మించడమే కాకుండా సనాతన ఆచారాలనూ పాటించి ఎక్కడా ఎలాంటి లోపమూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలోని అన్ని గ్రామాల నుంచి మట్టినీ, నీటినీ సేకరించి తెచ్చి అమరావతి నిర్మాణంలో వాటిని ఉపయోగిస్తున్నారు. అలాగే ఏపీలోని ఆలయాలు - మసీదులు - చర్చిల నుంచీ మట్టి - నీరు తెస్తున్నారు. వీటితోపాటు తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు - మసీదులు - చర్చిల నుంచి కూడా మట్టిని - నీరును తీసుకువెళ్లాలనని నిర్ణయించారు. అందులో భాగంగానే తెలంగాణలోని భద్రాచలం - యాదాద్రి - మేడారం సమ్మక్క సారక్క - మెదక్‌ చర్చి - అలంపూర్ - వేయి స్తంభాలగుడి - బాసర నుంచి మట్టి - నీటిని తేవాలని చంద్రబాబు సూచించారు.

మరోవైపు దేశంలోని ప్రముఖ క్షేత్రాలైన వైష్ణోదేవి ఆలయం - స్వర్ణ దేవాలయం - బుద్ధ గయ - రామేశ్వరం - కాశీ - పూరి - శబరిమలై - ఛార్‌ ధామ్‌ వంటి దివ్యక్షేత్రాలు - అజ్మీర్‌ - నాగపట్నం వేళంగిణి - జామా మసీదు - ముంబై - హైదరాబాద్‌ మక్కా మసీదు వంటి ప్రార్థనా స్థలాల నుంచీ మట్టి - నీరు తేనున్నారు.

కాగా వీటి సేకరణ బాధ్యతలను ఎంపీలకు అప్పగించారు. వారు దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాలకు స్వయంగా వెళ్లి తేవడమో, తెప్పించడమో చేయాల్సి ఉంది.