Begin typing your search above and press return to search.

యూపీ, క‌ర్ణాట‌క‌ల్లో ముఖ్య‌మంత్రుల మార్పు.. నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   7 Jun 2021 1:30 AM GMT
యూపీ, క‌ర్ణాట‌క‌ల్లో ముఖ్య‌మంత్రుల మార్పు.. నిజ‌మేనా?
X
బీజేపీ పాలిత పెద్ద‌రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క మాత్ర‌మే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ విష‌యంలో ఒకింత బాగానే ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. సెకండ్ వేవ్ విష‌యంలో మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లోనూ మ‌ర‌ణాలు పెరిగాయి. అదేస‌మ‌యంలో రోగులకు సరైన వైద్య అంద‌డం లేద‌ని బీజేపీ నేత‌లే బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బీజేపీ అధిష్టానానికి నిత్యం ముఖ్య‌మంత్రుల‌పై ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.

యూపీ విష‌యాన్ని తీసుకుంటే.. వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో సీఎం యోగి ఆదిత్య‌నాథ్ వైఖ‌రిపై ఇక్క‌డి బీజేపీ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయార‌ని, సీఎంను గ‌ద్దె దించాలంటూ.. ఓ వ‌ర్గం ఏకంగా అధిష్టానానికి లేఖ‌లు కూడా సంధించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యంపై ఆర్ ఎస్ ఎస్ కూడా ప‌ట్టు బ‌డుతోంది. అయితే.. యోగిని మార్చేందుకు ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో యూపీ ప‌రిస్థితి ఇంకా ఎటూ తేలలేదు.

ఇంత‌లోనే క‌ర్ణాట‌క‌లోనూ సీఎం య‌డియూర‌ప్ప సెంట్రిక్‌గా వివాదం తార‌స్థాయికి చేరింది. ఇటీవలే రాష్ట్ర మంత్రి సీపీ యోగేశ్వర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాడ్, బసనగౌడ పాటిల్ యత్నాల్.. నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నారని తెలిసింది. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కునే విషయంలో ప్రభుత్వం నిర్ణయాలపైనా కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మార్పు తప్పకుండా ఉంటుందనే వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇక‌, ఈ వివాదంపై తాజాగా సీఎం య‌డియూర‌ప్ప స్పందించారు. "హై కమాండ్ ఎప్పటివరకు ఉండమని చెబితే అప్పటివరకు పదవిలో కొనసాగుతా. ఒకవేళ హై కమాండ్ సీఎంగా తప్పుకోవాలని చెబితే.. వెంటనే పదవికి రాజీనామా చేస్తా. కానీ, భాజపా అధిష్ఠానం నాపై పూర్తి నమ్మకంతో ఉంటుంది. అని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో అటు యూపీ, ఇటు క‌ర్ణాట‌క బీజేపీ రాజ‌కీయాలు వేడెక్కాయ‌ని.. ఏ క్ష‌ణంలో అయినా.. ముఖ్య‌మంత్రుల మార్పు త‌థ్య‌మ‌ని విశ్లేష‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.