Begin typing your search above and press return to search.

చంద్రబాబు చేసిన తప్పే వైసీపీ చేస్తోందా ?

By:  Tupaki Desk   |   9 Aug 2021 12:01 PM IST
చంద్రబాబు చేసిన తప్పే వైసీపీ చేస్తోందా ?
X
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎంఎల్ఏ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతు అధికారపార్టీ చెప్పిందే చేయాలని అధికారులకు వార్నింగులు ఇవ్వటం సంచలనమైంది. టీడీపీ నేతలు చెప్పినా అధికారులు వినాల్సిన అవసరం లేదని, అధికారంలో ఉన్నది వైసీపీ అని గుర్తుంచుకోవాలని నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపింది. నిజానికి ఎన్నికలు జరిగే వరకు ప్రతిపక్షం, పాలకపక్షం అన్న తేడాలుంటాయి. ఎన్నికలైపోయిన తర్వాత గెలిచిన వారందరు ప్రజాప్రతినిదులే అనే విచక్షణ ఉండాలి. సర్పంచ్ నుండి ఎంఎల్ఏ వరకు ఇలాంటి భావన ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది.

నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు, అధికారులకు ఇచ్చిన వార్నింగులు మాత్రం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. నల్లపురెడ్డి వ్యాఖ్యలు ఎంత సంచలనమయ్యాయో ఒకపుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా అంతే సంచలనమయ్యాయి. తమ నియోజకవర్గాల అభివృద్ది కోసం తనను కలసిన వైసీపీ ఎంఎల్ఏలకు చంద్రబాబు స్పందన షాకిచ్చింది. ప్రతిపక్ష ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసేది లేదని స్పష్టగా వాళ్ళ మోహానే చంద్రబాబు చెప్పటం అప్పట్లో సంచలనమనే చెప్పాలి.

పైగా తాను వైసీపీ ఎంఎల్ఏలకు చెప్పిన విషయాన్ని కర్నూలు జిల్లా పర్యటన రోడ్డుషోలో చాలా గొప్పగా చంద్రబాబే చెప్పుకున్నారు. ప్రతిపక్ష ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎందుకు చేయాలి తమ్ముళ్ళూ అంటా మైకులో జనాలను అడగారు. వైసీపీ ఎంఎల్ఏలు గెలిచిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన టీడీపీ నేతల పేర్లతోనే అభివృద్ధి నిధులను మంజూరు చేస్తు జీవోలు కూడా రిలీజ్ చేశారు.

కలెక్టర్లు, ఎస్పీల సమీక్షలో మాట్లాడుతు అధికారపార్టీ నేతలు చెప్పిన పనులను చేయాల్సిందే అని చంద్రబాబు అప్పట్లో ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇలాంటి అనేక చర్యల వల్ల తర్వాత చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. ఇపుడు నల్లపురెడ్డి కూడా అలాగే మాట్లాడుతు, అధికారులకు వార్నింగులిస్తున్నారు. ఇపుడు చెప్పటానికి, వినటానికి బాగానే ఉంటుంది కానీ రేపటి ఎన్నికల సమయంలోనే ఇలాంటి చేష్టలన్నీ రివర్సవుతాయని గ్రహించాలి.

సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపాలికానీ వచ్చిన వాళ్ళు ఏ పార్టీఅని చూడటం ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడవటమే. నాలుగు గోడల మధ్య అధికారులతో మాట్లాడాల్సిన వన్నీ బహిరంగంగా మాట్లడటం వల్ల ప్రజాప్రతినిధులపై కచ్చితంగా జనాల్లో వ్యతిరేకత వస్తందనటంలో సందేహంలేదు. అందరు ఓట్లేస్తేనే వైసీపీకి అఖండ మెజారిటి వచ్చిందన్న విషయాన్ని నల్లపురెడ్డి మరచిపోయినట్లున్నారు. ఇన్నిసార్లు ఎంఎల్ఏగా గెలిచిన నల్లపురెడ్డి కూడా ఇలా మాట్లాడటమంటే జనాల్లో వ్యతరేకతను కోరితెచ్చుకోవటమే.