Begin typing your search above and press return to search.

90 శాతం కాద‌ట‌.. మంత్రుల మార్పులో కీల‌క ప‌రిణామం...?

By:  Tupaki Desk   |   26 March 2021 3:30 AM GMT
90 శాతం కాద‌ట‌.. మంత్రుల మార్పులో కీల‌క ప‌రిణామం...?
X
జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు నెల‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ స‌మీక‌ర‌ణ‌లు, అంచ‌నాలు మారుతున్నాయి. 2019 మేలో ఏర్ప‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఆయ‌న‌తో క‌లిపి 25 మంది మంత్రులు ఉన్నారు. అయితే.. జ‌గ‌న్ అప్ప‌ట్లోనే చెప్పిన లెక్క‌ల ప్రకారం.. 90 శాతం మంది అంటే.. 22 మందిని మార్చాలి. ఇదే జ‌రిగితే.. సీఎం స‌హా మ‌రో ఇద్ద‌రు మంత్రులు మిన‌హా.. అంద‌రినీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. మ‌రి ఇది ఇప్పుడు సాధ్య‌మేనా? ఇంత‌మందిని ప‌క్క‌న పెడితే.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చే వ్య‌తిరేక‌త ప‌క్క‌న పెడితే..నాయ‌క‌త్వంలోనూ వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం మెండుగా ఉంటుంది. దీనిపై నాయ‌కులు ఇప్ప‌టికే జ‌గ‌న్ కు ఒక నివేదిక అందించార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఇప్పుడు మంత్రివ‌ర్గ కూర్పుపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టారు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ మంత్రులుగా ఉన్న బొత్స స‌త్యానార‌య‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటివారు.. మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న జరిగితే.. వ‌చ్చే మార్పుల‌పై ఒక నివేదిక విడివిడిగా ఇచ్చిన‌ట్టు సమాచారం. దీని ప్ర‌కారం.. ఇప్పుడున్న మంత్రుల‌ను అంద‌రినీ మార్చ‌డం వ‌ల్ల వ్య‌తిరేక‌త మాట అటుంచితే.. ప్ర‌భుత్వ పాల‌న‌లో తేడా వ‌స్తుంద‌ని.. అస‌లు ఈ త‌ర‌హాలో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మార్పులు జ‌ర‌గ‌లేద‌ని.. పైగా వ‌చ్చే రెండేళ్ల‌లోనే తిరిగి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం మ‌రింత ప‌టిష్టంగా ప‌నిచేయాలంటే.. ఇప్పుడున్న‌వారిని కొన‌సాగిస్తేనే మంచిద‌ని.. ఇత‌మిత్థంగా ఇద్ద‌రు మంత్రులు వేర్వేరుగా ఇచ్చిన నివేదిక‌లు స్ప‌ష్టం చేసినట్టు స‌మాచారం.

అయితే.. అప్ప‌ట్లోనే మాట ఇచ్చారు క‌నుక‌.. మార్పు అనివార్య‌మ‌ని భావిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండేళ్ల‌కాలంలో ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్న ప్ర‌భుత్వ ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాల‌పై అవ‌గాహ‌న పెంచుకోని మంత్రుల‌ను గుర్తించి వారి వ‌ర‌కు ప‌క్క‌న పెట్ట‌డం ద్వారా.. మంత్రుల్లో స్పోర్టివ్ నెస్ పెంచేందుకు ఉపయుక్తంగా ఉంటుంద‌ని మంత్రులు సిఫార‌సు చేసిన‌ట్టు తెలిసింది. అంటే.. దీనిని బ‌ట్టి జ‌గ‌న్ చెప్పిన‌ట్టు 90 శాతం మంది మంత్రుల‌ను మార్చ‌డం కాకుండా.. కేవ‌లం 7 నుంచి 8 మంది మంత్రుల‌ను త‌ప్పించి.. కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డం స‌మంజ‌స‌మ‌ని వీరు పేర్కొన్న‌ట్టు తెలిసింది.

ఒక‌ర‌కంగా ఆలోచిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న మంత్రుల్లో ఓ ఏడెనిమిది మంది మంత్రులు త‌ప్ప‌.. మిగిలిన వారంతా జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను చేరువ చేస్తున్న‌వారే క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల టార్గ‌టె్‌ను సైతం వీరు స‌క్సెస్ చేశారు. ఈ క్ర‌మంలో 90 శాతానికి బ‌దులుగా .. ఏడెనిమిది మందితో `మార్పు`ను స‌రిపెడితే మంచిద‌న్న సూచ‌న‌ల‌కు జ‌గ‌న్ కూడా జైకొట్టే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే ప‌లు జిల్లాల్లో మంత్రి ప‌ద‌విపై భారీ ఆశ‌ల‌తో ఉన్న వారికి షాక్ త‌ప్ప‌దు.