Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ వీసాల‌పై ఇంకో షాక్ ఇస్తున్న‌ట్రంప్‌

By:  Tupaki Desk   |   4 April 2017 9:22 AM GMT
హెచ్‌1బీ వీసాల‌పై ఇంకో షాక్ ఇస్తున్న‌ట్రంప్‌
X
వ‌ల‌స నిపుణుల‌పై క‌త్తిగ‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికా స‌ర్కారు త‌న జోరును పెంచుతోంది. హెచ్‌1బీ వీసాల జారీ విధానంపై అమెరికా మ‌రింత క‌ఠిన‌త‌ర‌మైన ఆంక్ష‌ల‌ను విధించ‌నుంది. ట్రంప్ ప్ర‌భుత్వం దీనికి సంబంధించి కొత్త నియ‌మావ‌ళిని అమ‌లులోకి తెచ్చింది. వాస్త‌వానికి ప్ర‌తి ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి హెచ్‌1బీ వీసా సీజ‌న్ మొద‌ల‌వుతుంది. దీంతో ట్రంప్ ప్ర‌భుత్వం ఈ సోమ‌వారం నుంచి వ‌ర్కింగ్ వీసాల‌కు కావాల్సిన అర్హ‌త‌ల‌పై క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను వెల్ల‌డించింది. అదే స‌మ‌యంలో ఐటీ కంపెనీల‌ను తీవ్రంగా బెదిరించింది.

గ‌త అమెరికా ప్ర‌భుత్వాలు వీసాల జారీ వ్య‌వ‌హారంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని ట్రంప్ స‌ర్కార్ ఆరోప‌ణ‌లు చేసింది. అంతే కాదు, ట్రంప్ ప్ర‌భుత్వానికి చెందిన న్యాయ‌శాఖ కూడా ఐటీ కంపెనీల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసింది. వీసాల జారీ కోసం అమెరికాకు చెందిన ఉద్యోగుల‌ను ప‌క్క‌న‌పెట్ట‌డాన్ని స‌హించ‌బోమ‌ని న్యాయ‌శాఖ ఐటీ కంపెనీల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఒక‌వేళ స్థానిక ఉద్యోగుల‌ను ప‌క్క‌న‌పెడితే, ఆ అంశాన్ని విచారించి చ‌ర్య‌లు తీసుకునేందుకు అమెరికా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంటుంద‌ని కూడా హెచ్చ‌రించారు. ఈ ప‌రిణామం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

సాధార‌ణంగా అమెరికాకు చెందిన యూఎస్‌సీఐఎస్ విభాగం వీసాల‌ను జారీ చేస్తుంది. ఆ సంస్థ సోమ‌వారం కొత్త ఆంక్ష‌ల‌ను వెల్ల‌డించింది. వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేవాళ్లు కేవ‌లం డిగ్రీలు చూపిస్తే స‌రిపోదు అని, ద‌ర‌ఖాస్తు చేసుకునే ఉద్యోగానికి కావాల్సిన సాక్ష్యాలు, పేప‌ర్ వ‌ర్క్‌ ను కూడా అర్హ‌త‌లుగా చూపించాల‌ని ఆ సంస్థ పేర్కొంది. అంటే ఐటీ నిపుణులు త‌మ రంగంలో నిపుణుల‌మ‌ని ధ్రువీక‌రించే ప‌త్రాలు క‌లిగి ఉంటే వారికి హెచ్‌1బీ వీసా పొంద‌డం క‌ష్ట‌మేం కాదు. కాగా, వాస్త‌వానికి ఈ నిబంధ‌న‌లు ముందు నుంచే ఉన్నాయి. కానీ గ‌త ప్ర‌భుత్వాలు ఆ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యాయ‌ని ట్రంప్ స‌ర్కార్ భావిస్తోంది. ప్ర‌తి ఏడాది సుమారు 85వేల వీసాల‌ను అమెరికా జారీ చేస్తుంది. అందులో 50 శాతం పైగా భార‌తీయ ఉద్యోగుల‌కే ఆ వీసాల‌ను పొందుతారు. మ‌రోవైపు ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా కొన్ని అమెరికా కంపెనీలు కోర్టును ఆశ్ర‌యించారు. దేశంలో నైపుణ్యం క‌లిగిన కార్మికులు లేర‌ని, విదేశీ వ‌ర్క‌ర్లు అవ‌స‌ర‌మ‌ని టెక్ కంపెనీలు పేర్కొన్నాయి. వీసాల జారీ అంశంలో ఎటువంటి అక్ర‌మాల‌ను స‌హించ‌బోమ‌ని వైట్‌ హౌజ్ కూడా స్ప‌ష్టం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/